IND VS SL:శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్య నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. మంగళవారం తొలి టీ20లో 2 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మొదట దీపక్ హుడా (41 నాటౌట్; 23 బంతుల్లో 1×4, 4×6), ఇషాన్ కిషన్ (37; 29 బంతుల్లో 3×4, 2×6), అక్షర్ పటేల్ (31 నాటౌట్; 20 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో భారత్ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లంక బౌలర్లలో హసరంగ (1/22), తీక్షణ (1/29), చమిక కరుణరత్నె (1/22) రాణించారు. అనంతరం లంక నిర్ణీత ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర బౌలర్ శివమ్ మావి (4/22) అదరగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ (2/27), హర్షల్ పటేల్ (2/41) కూడా రాణించారు. కెప్టెన్ శానక (45; 27 బంతుల్లో 3×4, 3×6), చమిక (23 నాటౌట్; 16 బంతుల్లో 2×6) లంకను గెలిపించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. రెండో టీ20 గురువారం పుణెలో జరుగుతుంది.
కంగారెత్తించిన ఆ ఇద్దరూ.. :లంక ఇన్నింగ్స్ ఒక దశ వరకు సాగిన తీరు చూస్తే.. మ్యాచ్ ఇంత ఉత్కంఠభరితంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మావి సహా భారత బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది లంక. ఓపెనర్ కుశాల్ మెండిస్ (28) మినహా ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. నిశాంక (1), ధనంజయ (8), అసలంక (12), రాజపక్స (10) పెవిలియన్‌కు వరుస కట్టేశారు. కుశాల్ కూడా వెనుదిరగడంతో లంకకు ఆశలు సన్నగిల్లాయి. కానీ శానక, హసరంగ (21) అనూహ్యంగా భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి.. లంకను పోటీలోకి తెచ్చారు. హసరంగ ఔటయ్యాక కూడా శానక పోరాటం కొనసాగింది. ఒక దశలో సమీకరణం 21 బంతుల్లో 34 పరుగులతో తేలిగ్గా మారింది. కానీ శానకను ఔట్ చేసిన ఉమ్రాన్.. భారత్‌కు ఉపశమనాన్ని అందించాడు. ఆ తర్వాత చమిక తన ధాటిని చూపించాడు. 9 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్షల్ బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి అతను సిక్సర్ బాదడంతో 3 బంతుల్లో 5 పరుగులే చేయాల్సి వచ్చింది. అయితే ఒత్తిడిలో చివరి మూడు బంతులను అక్షర్ ఎంతో కట్టుదిట్టంగా వేశాడు. చమికకు షాట్ ఆడే అవకాశమే ఇవ్వలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. చమిక గట్టిగా ప్రయత్నించినా బౌండరీ రాలేదు.
తడబడి.. నిలబడి..:వాంఖడె పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలమన్న అంచనాల మధ్య టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి ఓవర్లో చూపించిన దూకుడు చూస్తే.. లంక ముందు 200 పైచిలుకు లక్ష్యం నిలుపుతుందేమో అనిపించింది. బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఊపును కొనసాగిస్తూ.. ఇషాన్ తొలి ఓవర్లో చెలరేగాడు. ఒక సిక్సర్, రెండు ఫోర్లతో తన ధాటిని చూపించాడు. రెండో ఓవర్లో శుభ్‌మన్ కూడా చక్కటి ఫోర్ కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇలా ఆశావహంగా ఆరంభమైన భారత ఇన్నింగ్స్.. తర్వాత కుదుపులకు లోనైంది. స్పిన్నర్ తీక్షణ తన తొలి ఓవర్లో మూడో బంతికే శుభ్‌మన్ (7)ను వికెట్ల ముందు బలిగొన్నాడు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. తర్వాత స్థానిక ఆటగాడు సూర్యకుమార్ 360 డిగ్రీ మెరుపుల కోసం చూసిన ముంబయి అభిమానులకు నిరాశ తప్పలేదు. అతను వికెట్ల వెనక్కి తనదైన శైలిలో షాట్ ఆడే ప్రయత్నంలో షార్ట్ ఫైన్‌లెగ్‌లో ఫీల్డర్‌కు దొరికిపోయాడు. సంజు శాంసన్ (5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న ఇషాన్‌తో కెప్టెన్ హార్దిక్ (29) తోడయ్యాక ఇన్నింగ్స్ కొంచెం కుదుటపడింది. 7 ఓవర్లలో 47/3తో ఉన్న భారత్.. 10 ఓవర్లకు 75/3తో కాస్త మెరుగుపడింది. కానీ కొన్ని ఓవర్ల వ్యవధిలో ఇషాన్, హార్దిక్ వెనుదిరగడంతో భారత్‌కు మళ్లీ కష్టాలు తప్పలేదు. 15 ఓవర్లకు స్కోరు 101/5. ఈ దశలో 140 దాటితే గొప్ప అనిపించింది. కానీ కాసేపు ఆచితూచి బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా, అక్షర్.. చివరి ఓవర్లలో చెలరేగి ఆడి జట్టుకు ఊహించని స్కోరు సాధించిపెట్టారు. తీక్షణ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు హుడా మళ్లీ ఊపు తెచ్చాడు. అక్షర్ సైతం సమయోచితంగా షాట్లు ఆడాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 61 పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్‌తో మావితో పాటు గిల్ టీ20 అరంగేట్రం చేశాడు.
భారత్ ఇన్నింగ్స్:ఇషాన్ (సి) ధనంజయ (బి) హసరంగ 37; శుభ్‌మన్ ఎల్బీ (బి) తీక్షణ 7; సూర్యకుమార్ (సి) రాజపక్స (బి) కరుణరత్నె 7; సంజు శాంసన్ (సి) మదుశంక (బి) ధనంజయ 5; హార్దిక్ (సి) కుశాల్ (బి) మదుశంక 29; దీపక్ హుడా నాటౌట్ 41; అక్షర్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం:(20 ఓవర్లలో 5 వికెట్లకు) 162; వికెట్ల పతనం: 1-27, 2-38, 3-46, 4-77, 5-94; బౌలింగ్: రజిత 4-0-47-0; మదుశంక 4-0-35-1; తీక్షణ 4-0-29-1; చమిక కరుణరత్నె 3-0-22-1; ధనంజయ డిసిల్వా 1-0-6-1; హసరంగ 4-0-22-1
శ్రీలంక ఇన్నింగ్స్:నిశాంక (బి) మావి 1; కుశాల్ (సి) శాంసన్ (బి) హర్షల్ 28; ధనంజయ (సి) శాంసన్ (బి) మావి 8; అసలంక (సి) ఇషాన్ (బి) ఉమ్రాన్ 12; భానుక రాజపక్స (సి) హార్దిక్ (బి) హర్షల్ 10; శానక (సి) చాహల్ (బి) ఉమ్రాన్ 45; హసరంగ (సి) హార్దిక్ (బి) మావి 21; చమిక కరుణరత్నె నాటౌట్ 23; తీక్షణ (సి) సూర్య (బి) మావి 1; రజిత రనౌట్ 5; మదుశంక రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్) 160; వికెట్ల పతనం:1-12, 2-24, 3-47, 4-51, 5-68, 6-108, 7-129, 8-132, 9-159; బౌలింగ్:హార్దిక్ పాండ్య 3-0-12-0; శివమ్ మావి 4-0-22-4; ఉమ్రాన్ మాలిక్ 4-0-27-2; చాహల్ 2-0-26-0; హర్షల్ పటేల్ 4-0-41-2; అక్షర్ పటేల్ 3-0-31-0