తెలంగాణ

telangana

ETV Bharat / sports

Team india: టీమ్​ఇండియా బౌలర్లకు ఏమైంది? - భారత్ దక్షిణాఫ్రికా బౌలర్లు

IND vs SA Test: క్లిష్టమైన సందర్భాల్లో గొప్పగా రాణించి జట్టుకు విజయాలందించిన భారత బౌలర్లు.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఇలా విఫలమవుతారని ఎవ్వరూ అనుకోలేదు. మరి ఎక్కడ తేడా జరిగింది? భారత పేస్‌ పస తగ్గిందా? పిచ్‌ సహకరించలేదా?

IND vs SA Test
భారత్ దక్షిణాఫ్రికా టెస్టు

By

Published : Jan 7, 2022, 6:43 AM IST

IND vs SA Test: "లక్ష్యం 200 దాటితే చాలు.. దక్షిణాఫ్రికాకు కష్టమే! భారత్‌ విజయం లాంఛనమే".. రెండో టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ నడుస్తున్నపుడు చాలామంది అంచనా ఇది.

సఫారీ జట్టు ముందు 240 లక్ష్యం నిలిచినపుడు జొహానెస్‌బర్గ్‌లో భారత్‌ జయకేతనం ఎగురవేయబోతోందని, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ కోసం మూడు దశాబ్దాలుగా సాగుతున్న నిరీక్షణ ఫలించబోతోందని అంచనాలు కట్టేశారు భారత అభిమానులు. కానీ చాలా కష్టం అనుకున్న లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం మూడే వికెట్లు కోల్పోయి సునాయాసంగానే ఛేదించేసింది.

కారణాలు అవేనా..?

కొన్నేళ్లుగా ఇలాంటి సందర్భాల్లో గొప్పగా రాణించి భారత్‌కు విజయాలందించిన బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో ఇలా విఫలమవుతారని ఎవ్వరూ అనుకోలేదు. మరి ఎక్కడ తేడా జరిగింది? భారత పేస్‌ పస తగ్గిందా? పిచ్‌ సహకరించలేదా? లేక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ అంత గొప్పగా పోరాడారా? అన్న ప్రశ్నలు భారత అభిమానులను వేధిస్తున్నాయి? వాండరర్స్‌ పిచ్‌ అయితే అంత సులువుగా ఏమీ లేదు.

బంతి బాగా బౌన్స్‌ అయింది. బ్యాట్స్‌మెన్‌కు గట్టి సవాలే విసిరింది. అయితే భారత బౌలర్లు ఒంటి మీదికి ప్రమాదకర రీతిలో బంతులు సంధిస్తూ భయపెట్టే ప్రయత్నం చేసినా.. మొక్కవోని పట్టుదలతో నిలిచిన ఎల్గర్‌ను ఎంత పొగిడినా తక్కువే.

ఆట, ఆటేతర వ్యవహారాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా జట్టు.. ఈ మ్యాచ్‌లో ఓడితే ఒక రకమైన సంక్షోభంలో పడుతుందని ఎల్గర్‌కు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌ అసాధారణంగా పోరాడాడు. అతడికి మిగతా సహచరులు కూడా సహకరించడం వల్ల దక్షిణాఫ్రికా విజయం సాధ్యమైంది.

ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా వైఫల్యమే పెద్ద ఎదురు దెబ్బ. పేస్‌ దళాన్ని ముందుండి నడపిస్తాడనుకుంటే ఈ సిరీస్‌లో అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతడి పేస్‌లో పదును తగ్గిందన్నది స్పష్టం. ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా అతణ్ని వెనక్కి లాగుతున్నట్లున్నాయి. సిరాజ్‌ సైతం రెండో టెస్టులో గాయంతో ఇబ్బంది పడి పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోవడం వల్ల సఫారీ జట్టుపై ఒత్తిడి తగ్గిపోయింది. షమి, శార్దూల్‌ శాయశక్తులా ప్రయత్నించినా మిగతా బౌలర్ల నుంచి సహకారం అందక ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు.

ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో అయినా మన పేస్‌ దళం స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చిరకాల వాంఛను నెరవేరుస్తుందేమో చూడాలి.

ఇదీ చూడండి:IND vs SA Test: వాండరర్స్‌ మైదానంలో వికెట్‌.. కుంబ్లే తర్వాత అశ్వినే!

ABOUT THE AUTHOR

...view details