KL Rahul Record: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (122 నాటౌట్; 248 బంతుల్లో) ఆదివారం శతకం సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో తొలి రోజు భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రాహుల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై శతకం సాధించిన భారత రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. అది కూడా 14 ఏళ్ల తర్వాత సాధించడం గమనార్హం. ఇంతకుముందు మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ 2007 పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టీమ్‌ఇండియా తరఫున శతకం (116) బాదిన ఓపెనర్‌గా నిలిచాడు. మళ్లీ ఇన్నాళ్లకు రాహుల్ ఆ ఘనత సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా రాహుల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దేశాల్లో సెంచరీలు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే పాకిస్థాన్ మాజీ బ్యాటర్ సయీద్ అన్వర్, వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ తర్వాత ఆసీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల్లో సెంచరీలు బాదిన మూడో ఓపెనింగ్ బ్యాటర్‌గానూ ఘనత సాధించాడు.