IND vs SA ODI: వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ కగిసొ రబాడ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. "ప్రోటీస్ సీమ్ బౌలర్ కగిసో రబాడను భారత్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు పక్కన పెడుతున్నాం. గత కొద్ది కాలంగా విరామం లేకుండా అతడు క్రికెట్ ఆడుతున్నాడు. అతడిపై పని భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు రబాడ అందుబాటులోకి వస్తాడు" అని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించింది.
"కరోనా కారణంగా ప్రస్తుతం ఆటగాళ్లంతా బయె సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్ (బీఎస్ఈ)లో ఉంటున్నారు. అందుకే కొత్తగా ఎవరినీ జట్టులోకి తీసుకోం. ఒకవేళ అదనపు స్పిన్నర్ అవసరమైతే.. ఇటీవల ముగిసిన టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్న జార్జ్ లిండేను తీసుకుంటాం" అని సీఎస్‌ఏ వెల్లడించింది. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో రబాడ కీలకంగా వ్యవహరించాడు. మూడు టెస్టుల్లో కలిపి 19.05 సగటులో 20 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే ఊపుతో వన్డే సిరీస్‌లో కూడా పై చేయి సాధించాలని చూస్తోంది. టెస్టు సిరీస్‌లో రాణించిన తెంబా బవుమా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఇటీవల టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్.. ఈ సిరీస్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. బోలాండ్ పార్క్ వేదికగా నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి వన్డే ప్రారంభం కానుంది.