IND vs SA 3rd test day 3: భారత్, సౌతాఫ్రికా మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే విజయం సాధించే అవకాశాలు ఆతిథ్య జట్టువైపే ఉన్నట్లుగా కనిపిస్తోంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 111 పరుగులు చేయాలి.. భారత్ ఎనిమిది వికెట్లను పడగొట్టాలి. మరోవైపు పీటర్సన్ (48*) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా పీటర్సన్-ఎల్గర్ (30) జోడీ వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఎట్టకేలకు బుమ్రా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ (30) వికెట్ దొరకడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఓపెనర్ మార్‌క్రమ్ (16) విఫలమయ్యాడు. టీమ్‌ఇండియా బౌలర్లు షమీ, బుమ్రా చెరో వికెట్ తీశారు. నాలుగో రోజు ఆట.. తొలి సెషన్‌లో వికెట్లను తీసినదానిని బట్టి విజయం ఖరారవుతుంది.
ఒకే ఒక్కడు.. పంత్
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఈ మాత్రం స్కోరు చేసిందంటే ప్రధాన కారణం రిషభ్ పంత్ (100*). అద్భుతమైన శతకం సాధించి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. పంత్ కాకుండా విరాట్ కోహ్లీ (29) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేయగా.. బదులుగా సౌతాఫ్రికా 210 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసిన కోహ్లీ సేన.. దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.