Ind vs Pak Top 5 Wicket Takers :ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనగానే క్రీడాభిమానుల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ పోరులో సత్తాచాటి ప్రతిభ నిరూపించుకోవాలని ఇరు జట్ల ఆటగాళ్లు అనుకుంటారు. కొందరు పరుగుల వరద పారించి గ్రేట్ అనిపించుకుంటే.. అత్యధిక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పి ఔరా అనిపిస్తారు మరికొందరు. అలాంటి వారికి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆలా ఇండో-పాక్ మ్యాచ్‌ల్లో బంతితో రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు ఉన్నారు. ఇంతగొప్ప ఘనతను ఎలా సాధించారని అంతా ఆశ్చర్యపోయేలా అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వసీమ్ అక్రమ్
Wasim Akram: క్రికెట్ చరిత్రలో వసీమ్ అక్రమ్‌కు ఫాస్ట్ బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. నాణ్యమైన పేస్‌తో బంతిని స్వింగ్ చేయడం అతడి ప్రత్యేకత. ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లలో అక్రమ్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 48 వన్డే మ్యాచ్‌లు ఆడిన అక్రమ్.. 3.73 ఎకానమీ రేట్‌తో 60 వికెట్లు తీశాడు. 4/35 అతడి అత్యుత్తమ ప్రదర్శన.
సాఖ్లెయిన్ ముస్తాఖ్
Mushtaq Saqlain: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ముస్తాఖ్‌కు మంచి గుర్తింపు ఉంది. 1990 దశకం చివర్లో 2000 ఆరంభంలో ముస్తాఖ్.. భారత్‌తో ఆడిన అనేక మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో క్రికెట్లో అతడికి 'దూస్రా' అనే ముద్దుపేరు వచ్చింది. భారత్‌తో 36 మ్యాచ్‌లు ఆడిన ముస్తాఖ్.. 57 వికెట్లు నేలకూల్చాడు. 5/45 అతడి అత్యుత్తమ ప్రదర్శన. క్రికెట్ నుంచి రిటైరయ్యాక ఇతడు.. 2021-22 సమయంలో పాక్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు.
అనిల్ కుంబ్లే
Anil Kumble :టీమ్ఇండియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేఅద్భుతమైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పిచ్‌పై అయినా బంతిని బౌన్స్ చేయడంలో కుంబ్లే.. నైపుణ్యం కలిగిన ఆటగాడు. చాలా మ్యాచ్‌లలో పాకిస్థాన్ బ్యాటర్లను తికమక పెట్టి.. చిక్కుల్లో పడేసిన సందర్భాలు కుంబ్లే సొంతం. అయితే దాయాది జట్టుపై కుంబ్లేకు ప్రత్యేక రికార్డులే ఉన్నాయి. పాకిస్థాన్‌తో 34 మ్యాచ్‌ల్లో 4.29 ఎకానమీ రేట్‌తో కుంబ్లే 54 వికెట్లు తీశాడు. ఇక 4/12 అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.