IND Vs ENG World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ తలపడనుంది. లఖ్‌నవూ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవుతాడన్న వార్తలకు చెక్ పడింది. గేమ్‌కు రోహిత్ వచ్చేశాడు.టాస్ సమయంలో జోస్ బట్లర్‌తో కలిసి రోహిత్ మైదానంలోకి వచ్చాడు.
ఇక ఈ మ్యాచ్ వేదికైన లఖ్‌నవూ ఏకనా స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. స్పిన్నర్లతో పాటు పేసర్లూ బాగా ప్రభావం చూపుతారు. కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. ఆరంభంలో పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలిస్తుంది.
మంచి అంచనాలతో బరిలో దిగిన భారత్.. అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శన చేస్తోంది. వరల్డ్ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మాత్రం ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించింది. అఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతుల్లో ఓటమి పాలవడం వల్ల ఆ జట్టు దాదాపుగా సెమీస్‌కు దూరమైనట్లే కనిపిస్తోంది. అయితే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఇక ఇంగ్లాండ్ తమ సెమీస్ ఆశలను నిలబెట్టుకున్నట్లే అని విశ్లేషకుల మాట.
ఈ టోర్నీలో ప్రదర్శన ఎంత పేలవంగా ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. ప్రపంచకప్ ముందు వరకు అన్ని జట్లనూ ఈ టీమ్ భయపెట్టింది. దీంతో ఇప్పటికీ ఈ జట్టుపై అందరూ ఆశలు పెట్టుకుంటున్నారు. ఒక మ్యాచ్‌లో అన్నీ కలిసొస్తే ఆ జట్టు ఆటతీరే మారిపోవచ్చని భావిస్తున్నారు. కాబట్టి బట్లర్ సేనను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఈ మ్యాచ్ కూడా ఓడితే టోర్నీలో ఇంగ్లాండ్ కథ ముగుస్తుంది. కాబట్టి కప్‌పై ఉన్న కసితో ఈ మ్యాచ్‌ను బలంగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, రూట్, బట్లర్, లివింగ్‌స్టన్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ తనదైన రోజున ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కోగలదు.