బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియాకే ఆధిపత్యం దక్కింది. సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ అదరగొట్టేశారు. దీంతో ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మామినుల్ హక్(84: 12 ఫోర్లు, ఒక సిక్స్) ఒంటరి పోరాటం చేసినా ఇతర ఆటగాళ్లెవరూ సహకరించలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేశ్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. జయదేవ్ ఉనద్కత్ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు నిలకడగా ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (3*), శుభ్‌మన్ గిల్(14*) క్రీజులో ఉన్నారు. మధ్యలో రెండుసార్లు వీరు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను కుదించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో ఉంది.