Ind vs Afg 2nd T20:అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అఫ్గాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ 68 పరుగులు, శివమ్ దూబే 63* హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కరీమ్ జనత్ 2, నవీన్ ఉల్ హక్, ఫారుకీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-0తో భారత్ వశమైంది. మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు దక్కించుకున్న టీమ్ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది
లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు తొలి ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక 14 నెలల తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (29 పరుగులు, 16 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడాడు. 5.3 ఓవర్ వద్ద విరాట్‌ను నవీనుల్ హక్ ఔట్ చేశాడు. అయినప్పటికీ జైశ్వాల్ తన దూకుడు తగ్గించలేదు. అనంతరం క్రీజులోకి వచ్చిన దూబేతో కలిసి రెచ్చిపోయాడు. మరోవైపు దూబే కూడా దంచేశాడు. వీరి దూకుడుతో భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. గుల్బాదిన్ (57 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించగా, నజీబుల్లా (23 పరుగులు), కరిమ్ (20 పరుగులు), ముజీబ్ (21 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో అఫ్గాన్ టపటపా వికెట్లు పారేసుకుంది. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో రెండు, శివమ్ దూబే 1 వికెట్ దక్కించుకున్నారు.