ICC World Cup 2023 IND VS PAK : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ మహా సమరం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు ముహూర్తం ఖరారైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ విశ్వ సమరంలో టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్‌ను ఆక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ వరల్డ్ కప్ మొత్తం ఒకెత్తు అయితే.. భారత్ పాకిస్థాన్ మ్యాచ్ మరోఎత్తు. దాయాది జట్టుతో జరగబోయే ఈ హైఓల్టేజ్ మ్యాచ్.. అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను, రికార్డులను ఓ సారి చూద్దాం..
అదే రిపీట్ అవుతుందా..?
1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 వరల్డ్ కప్‌ల్లో ఏడుసార్లు భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ గెలవలేదు. 2019లో చివరిసారిగా పాకిస్థాన్‌ను 89 పరుగులతో భారత్ చిత్తుగా ఓడించింది. అన్ని మ్యాచ్‌ల్లో భారత్ పైచేయి సాధించింది. ఇకపోతే టీ20 వరల్డ్ కప్ 2022లో చివరి సారిగా భారత్ పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది. అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో రెండు సార్లు పాక్‌ను ఎదుర్కొన్న భారత్.. మొదటి మ్యాచ్‌లో గెలిచింది. రెండో దాంట్లో మాత్రం పాక్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక, గత మూడు వరల్డ్ కల్లో ఆతిథ్యమిచ్చిన దేశాలే టైటిల్ సాధించాయి. ఇవే సెంటిమెంట్లు రిపీట్ అయితే.. పాకిస్థాన్‌పై ఇండియా మరోసారి గెలవడం పక్కా. అలానే టీమ్ఇండియా వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడుతుంది.
ఎవరి బలం ఎంత..
చివరిసారిగా 2011లో జరిగిన వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన చేసి టీమ్ఇండియా.. 28 ఏళ్ల తర్వాత రెండో వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత రెండు వరల్డ్ కప్‌లు జరిగినా.. భారత్ మూడో కప్పు సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది భారత్.
టీమ్ఇండియా బలాబలాల విషయానికొస్తే.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎప్పుడూ మనదే పైచేయి ఉంటుంది. ముఖ్యంగా సొంతగడ్డపై సిరీస్‌లంటే మనవాళ్లు విజృంభిస్తారు. భీకర ఫామ్‌తో మన దేశ పర్యటనకు వచ్చే జట్లకు గర్వభంగం చేసి మరీ పంపిస్తారు. అలానే గత కొన్నేళ్లలో విదేశాల్లో కూడా అడపాదడపా కొన్ని విజయాలు సాధిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే ఐసీసీ నిర్వహించే టోర్నీల టీమ్ఇండియా గెలిచి సుమారు 10 ఏళ్లు అవుతోంది. చివరిసారిగా మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీను భారత జట్టు ముద్దాడింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క మేజర్ టోర్నీలోనూ భారత జట్టు విజయం సాధించలేకపోయింది. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు ఫైనల్ చేరిన టీమ్ఇండియా.. అసలు సమరంలో (న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై) చేతులత్తేశారు. అయితే తాజా టోర్నీ సొంత మైదానాల్లో ఆడుతుండడం వల్ల భారత జట్టుకు కలిసి వస్తుందని అభిమానులతో పాటు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్లో కోహ్లీ, గిల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. అతడు కాస్త ఫైర్‌గా ఆడితే తిరుగుండదు. ఇక మిడిలార్డర్లో గాయాలతో దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి వచ్చే అవకాశముంది. వారు చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నారు. వారు చెలరేగి ఆడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వికెట్ కీపర్‌గా.. రాహుల్‌నే కొనసాగిస్తారా లేదా శాంసన్, ఇషాన్ కిషన్‌కు చోటిస్తారా అనేది చూడాలి. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు. అతడు కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తే తిరుగుండదు.