హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచిన మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను మరోసారి ఆస్ట్రేలియా ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా వరుసగా మూడోసారి కూడా మెగా ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేసింది. 2018, 2020 టీ20 వరల్డ్‌కప్‌లను కూడా ఆస్ట్రేలియా గెలుచుకుంది.
ఆరోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడిన ఆసీస్ అమ్మాయిలు.. దక్షిణాఫ్రికాకు నిరాశే - ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆసీస్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను ఆరోసారి ఆస్ట్రేలియా ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. వికెట్లు కోల్పోయినా దూకుడు తగ్గలేదు. ముఖ్యంగా బేత్ మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 53 బంతుల్లో 74 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్) చేసింది. మూనీ మినహా.. మిగతా ఆటగాళ్లందరూ 30 కంటే తక్కువే పరుగులు చేశారు. గార్డ్‌నర్ 29 పరుగులు (21 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసింది. ఆస్ట్రేలియా అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె కాప్ 2, షబ్నిమ్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీయగా.. మ్లాబా, ట్రయాన్ తలో వికెట్ తీశారు.
157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 17 పరుగుల వద్ద టాజ్మిన్ బ్రిటిస్(10) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం దక్షిణాఫ్రికా వికెట్లను కాపాడుకునే యత్నంలో మెల్లగా ఆడింది. దాంతో రన్‌రేట్ పెరిగిపోయి చివరకు ఓటమి పాలైంది. 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసిన సఫారీలు.. ఆపై తేరుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ లౌరా(61; 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయింది. దక్షిణాఫ్రికా 137 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.
ఇది ఆసీస్ మహిళలకు ఆరో వరల్డ్‌కప్ కాగా, రెండోసారి హ్యాట్రిక్ కప్‌లను సొంతం చేసుకోవడం మరో విశేషం. గతంలో 2010, 2012, 2014 టీ20 వరల్డ్‌కప్‌లను కూడా ఆసీస్ మహిళలు వరుసగా దక్కించుకున్నారు.