ICC Rankings Batsman : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదివరకు టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1గా ఉన్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను వెనక్కి నెట్టాడు. అయితే యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్టులో అద్భుతమైన శతకంతో విరుచుకుపడ్డ జో రూట్‌ను నాలుగు స్థానాలు దిగజార్చి ఐదో స్థానానికి పంపించాడు కేన్. రెండో టెస్టులో పేలవ ప్రదర్శన కనబరచడంతో రూట్ తన టాప్ ర్యాంక్‌ను కోల్పోవాల్సి వచ్చింది. కాగా విలియమ్సన్ తన టెస్టు కెరీర్‌లో నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.
110 రోజులుగా ఆడలేదు.. అయినా..
ICC Test Rankings Batsman : కేన్ విలియమ్సన్ తన చివరి టెస్టును శ్రీలంకతో ఈ ఏడాది మార్చి 17న వెల్లింగ్టన్ వేదికగా ఆడాడు. ఆ తర్వాత ఎటువంటి టెస్టు మ్యాచుల్లో పాల్గొనలేదు. అంటే దాదాపు 110 రోజులుగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని కేన్.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకోవడం విశేషం. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్-16 తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన విలియమ్సన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర సిక్స్‌ను ఆపే క్రమంలో కేన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఐపీఎల్-16లోని మిగతా మ్యాచులు ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. మోకాలికి గాయం కావడంతో తిరిగి స్వదేశానికి వెళ్లి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఆపరేషన్ అనంతరం ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు విలియమ్సన్. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు.