తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: భారత్​ 5, పాక్​ 1.. ఈ సారి గెలుపెవరిదో? - పాక్​ తో భారత్​ ఢీ

టీ20 ప్రపంచకప్​లో భాగంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​ ఆదివారం జరగనుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20, వన్డే ప్రపంచకప్​ల్లో భారత్​దే పై చేయి. మొత్తం ఆరు మ్యాచ్​లు జరగగా.. అయిదింటిలో భారత్​ గెలిచింది. ఈ నేపథ్యంలో గతంలో ఇరు జట్లు ఆడిన మ్యాచ్​ ఫలితాలను ఓసారి గమనిద్దాం..

t20 world cup india vs pak
india vs pakistan

By

Published : Oct 22, 2022, 3:45 PM IST

T20 World Cup: భారత్‌-పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అదీ ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మ క టోర్నీల్లో అయితే అది ఇంకాస్త పెరుగుతుంది. అభిమానుల్లో భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అయితే ఇప్పుడు అలాంటి సమరమే మరో రోజులో రానుంది. ఈసారి కూడా టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ తలపడనుంది. అక్టోబర్‌ 23న జరిగే ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ క్రికెట్‌ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటివరకు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 6 సార్లు ఆడితే ఐదుసార్లూ పాక్‌ను టీమ్ఇండియా ఓడించింది. ఆదివారం దాయాదుల మధ్య ఆరో మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో విశ్వ సమరంలో భారత్‌ ఘన విజయాలను ఓసారి చూద్దాం..

భారత్​దే పైచేయి..
తొలి ప్రపంచ కప్​లో.. ఇండియా vs పాక్​ మ్యాచ్​ 2007:
టీ20 తొలి ప్రపంచకప్‌లోనే భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌ జరిగింది. 2007 సెప్టెంబర్‌ 4న డర్బన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లీగ్‌ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి.ఇరు జట్లు స్కోర్లు సమం కాగా మ్యాచ్‌ బౌలౌట్‌కు దారి తీసింది. బౌలౌట్‌లో సెహ్వాగ్‌, భజ్జీ, ఉతప్ప వికెట్లను నేలకూల్చగా పాకిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. దీంతో భారత్ 3-0 తేడాతో దాయాదిపై గెలుపొందింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏకైక బౌలౌట్‌ ఇదే కావడం గమనార్హం.

అదే కప్​లో మరో సారి..
ఇదే ప్రపంచకప్‌లో జోహనెస్‌బర్గ్‌ వేదికగా 2007 సెప్టెంబర్‌ 24న జరిగిన ఫైనల్‌ యావత్ దేశాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. చివరి ఓవర్‌ వరకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో భారత్‌ విజయనాదం చేసి తొలి టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. గంభీర్‌ అద్భుత బ్యాటింగ్‌తో రాణించాడు. ఆఖరి ఓవర్లో జోగిందర్ శర్మ వేసిన బంతిని మిస్బా ఉల్‌ హక్‌ స్కూప్‌ ఆడబోయి శ్రీశాంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో పాక్‌ రెండో సారి భారత్‌ చేతిలో పరాజయం పాలైంది.

ఇండియా vs పాక్​(2012)
టీ20 వరల్డ్‌కప్‌లో 2012 సెప్టెంబర్‌ 30న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్‌-పాక్ మూడోసారి తలపడ్డాయి. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ 128 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌లో దాయాదిపై మూడో విజయం నమోదు చేసింది.

దాయది టీమ్​ వర్సెస్​ టీమ్​ఇండియా (2014)..
2014 మార్చి 21 బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా పాక్‌పై భారత్‌ మరో ఏకపక్ష విజయం నమోదు చేసింది. టీమ్​ఇండియా దెబ్బకు పాక్‌ 130 పరుగులకే ఆలౌట్‌ అవ్వగా భారత జట్టు తేలిగ్గా గెలిచింది.

పాక్​ తో భారత్​ ఢీ (2016)
2016 మార్చి 19న చివరిసారిగా కోల్‌కతాలో పాక్‌తో తలపడిన పోరులో భారత్‌ దుమ్ము రేపింది. పాక్‌ను 118 పరుగులకే కట్టడి చేసిన టీమ్​ఇండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్‌ అమీర్‌ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా విరాట్‌ కోహ్లీ అర్ధ శతకంతో సత్తా చాటాడు. ఈ విజయంతో దాయాదిపై టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ ఐదో విజయం నమోదు చేసింది.

వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌కు పాక్‌పై తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా అన్నిసార్లు టీమ్ఇండియానే గెలుపొందింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీలో మాత్రం భారత్‌ 2 సార్లు గెలవగా.. పాక్‌ మూడుసార్లు విజయం సాధించింది. మొత్తంగా ఐసీసీ టోర్నీలో భారత్‌- పాక్ 17 సార్లు తలపడగా.. 14 సార్లు టీమ్​ఇండియా.. 3 సార్లు పాక్‌ గెలిచాయి.

భారత్ vs పాకిస్థాన్, 2021 (గ్రూప్ మ్యాచ్​):
ఎట్టకేలకు ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. షాహీన్ షా అఫ్రిది మొదటి మూడు ఓవర్లలో రోహిత్ శర్మ (0), KL రాహుల్ 8 బంతుల్లో 3 పరుగులకే పెవిలియన్​ బాట పట్టించాడు. రిషబ్ పంత్ 39 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. నిర్ణీత ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది. పాక్​ బ్యాటర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత ప్రదర్శన చేయడం వల్ల మొదటి సారి మెగా టోర్నీలో భారత్​పై పాక్​ గెలిచింది.

భారతే ఫేవరెట్​
ఈ మ్యాచ్​లో భారత్​ ఫేవరెట్​గా బరిలో దిగుతుండగా.. పాకిస్థాన్​ కూడా బలంగానే కనిపిస్తోంది. అయితే గాయాల సమస్యలతో భారత్​ కొంత ఇబ్బంది పడుతోంది. బ్యాటింగ్​ లైన్ ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్​ విషయంలోనే ఆందోళన నెలకొంది. అదివారం మెల్​బోర్న్​ వేదికగా ఏడో సారి దాయాదుల మధ్య పోరు జరగబోతోంది.

ఇదీ చదవండి:ICC World Cup: అవసరమైతే ప్రతి మ్యాచ్​లో టీమ్​ను మార్చడానికి రెడీ: రోహిత్ శర్మ

'నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం.. ఆ నిర్ణయంతో షాక్‌కు గురయ్యా'

ABOUT THE AUTHOR

...view details