తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల పొట్టి ప్రపంచకప్ సమరం.. కసితో ఆడితే టైటిల్ మనదే! - ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2023 స్క్వాడ్​

వన్డేల్లో రెండుసార్లు.. టీ20ల్లో ఓసారి.. మొత్తంగా ఐసీసీ ప్రపంచకప్‌ల్లో మూడుసార్లు ఫైనల్‌ చేరిన భారత మహిళల సీనియర్‌ జట్టు.. తుదిమెట్టుపై బోల్తాపడింది. కానీ దశాబ్దాల కప్పు కలను అందుకునేందుకు.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు.. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. అండర్‌-19 అమ్మాయిల విజయం స్ఫూర్తినిస్తుండగా.. కప్పును ముద్దాడేందుకు శుక్రవారం ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ సమరానికి టీమ్‌ఇండియా సై అంటోంది. బలాలను వాడుకుంటూ.. బలహీనతలను అధిగమిస్తూ.. ఆత్మవిశ్వాసంతో సాగితే కప్పు కల సాకరమైనట్లే!

Icc t20 Womens World Cup 2023
Icc t20 Womens World Cup 2023

By

Published : Feb 9, 2023, 7:03 AM IST

కొన్నేళ్లుగా భారత సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టు ఆట ప్రమాణాలు పెరిగాయి. గొప్ప విజయాలూ దక్కుతున్నాయి. కానీ ప్రపంచకప్‌ లోటు మాత్రం అలాగే ఉంది. జట్టు మెరుగ్గానే ఉన్నా.. ప్రదర్శన ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురై మెగా టోర్నీల్లో తలవంచుతోంది. టీమ్‌ఇండియాకు బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్య లేదనే చెప్పాలి. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ లాంటి వాళ్లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగానే ఉంది.

స్పిన్‌ దళం కూడా సత్తాచాటేదే. కానీ ఏడాదికి పైగా విరామం తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్‌ శిఖా పాండేతో పాటు ఏపీ అమ్మాయి అంజలి శర్వాణి, రేణుక సింగ్‌, పూజ వస్త్రాకర్‌తో కూడిన పేస్‌ విభాగం ఒక్కటే కలవరపరుస్తోంది. పేసర్లకు ఎక్కువగా అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై వీళ్లు రాణించాలి. విదేశీ పేసర్లకు అలవాటైన ఈ పిచ్‌లపై మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది కీలకం.

ఆ స్ఫూర్తితో.. ఒత్తిడిని దాటి..:అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం తమలో స్ఫూర్తిని రగిలిస్తోందని, ఈ సారి కప్పు గెలుస్తామని భారత సీనియర్‌ క్రికెటర్లు అంటున్నారు. ఆ మాటలను నిజం చేయాలంటే ముందు జట్టు వ్యక్తిత్వం, క్రికెటర్ల ఆలోచనా ధోరణి మారాలి. తమపై తమకు నమ్మకం ఉండాలి. జట్టుగా కలిసి ఎంతటి ప్రత్యర్థినైనా ఓడిస్తామనే ఆత్మవిశ్వాసంతో సాగాలి. 160 పరుగులకు పైగా లక్ష్యం ఉంటే ముందే డీలా పడడం మాని, విజయం కోసం చివరి వరకూ పోరాడాలి.

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ సూపర్‌ ఓవర్లో అద్భుత విజయాన్ని అందుకుంది. అలాంటి పోరాట పటిమను నిరంతరం కొనసాగించాలి. మన అండర్‌-19 జట్టు గెలుస్తామనే నమ్మకంతోనే టోర్నీలో అడుగుపెట్టింది. టోర్నీ సాంతం అదే కసి, తపన చూపించింది. ఇప్పుడు సీనియర్‌ అమ్మాయిలూ అదే బాటలో సాగాలి. ప్రత్యర్థిని చూసి భయపడడం మాని, ప్రదర్శనతో గుబులు పుట్టించాలి. చేరాల్సిన గమ్యాన్ని, సాధించాల్సిన లక్ష్యాన్ని ఎప్పటికప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ విజయాల వేట కొనసాగించాలి. ముఖ్యంగా జట్టు దూకుడు ప్రదర్శించాలి.

నాకౌట్‌ తడబాటు: ప్రపంచకప్‌ నాకౌట్లో తడబడే బలహీనతను భారత్‌ అధిగమించాలి. ఇప్పటివరకూ వన్డేలు, టీ20 కప్పుల్లో కలిపి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ నాకౌట్లో టీమ్‌ఇండియా అడ్డుగా నిలిచాయి. వన్డే ప్రపంచకప్‌ల్లో 1997 (ఆస్ట్రేలియాపై), 2000 (కివీస్‌పై) సెమీస్‌ల్లో ఓడింది. 2005 (ఆస్ట్రేలియాపై), 2017 (ఇంగ్లాండ్‌పై) ఫైనల్లో పరాజయం పాలైంది. టీ20 ప్రపంచకప్‌ల్లో 2009 (కివీస్‌పై), 2010 (ఆస్ట్రేలియాపై), 2018 (ఇంగ్లాండ్‌పై) సెమీస్‌ల్లో వెనుదిరిగింది. 2020లో తుదిపోరులో ఆసీస్‌ చేతిలో ఓడిపోయింది. గతేడాది కామన్వెల్త్‌ క్రీడల ఫైనల్లోనూ ఆసీస్‌పై గెలవలేకపోయింది.

ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో కప్పును చేజిక్కించుకోవాలంటే ఈ అగ్రశ్రేణి జట్లను భారత్‌ దాటాల్సిందే. నిరుడు ఆసియాకప్‌లో ఛాంపియన్‌గా నిలిచి రికార్డు స్థాయిలో ఏడో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న అమ్మాయిలు.. ఇప్పుడీ విశ్వ సమరంలోనూ ఆ జోరు కొనసాగించాలి. ఇంగ్లాండ్‌తో పాటు గ్రూప్‌- బిలో ఉన్న భారత్‌కు సెమీస్‌లో ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సవాలుకు ముందు నుంచే సన్నద్ధమై, మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలి. ఏదేమైనా కప్పు గెలవాల్సిందేనన్న తెగువ ప్రదర్శిస్తేనే మన అమ్మాయిలు విశ్వవిజేతలవుతారు.

ABOUT THE AUTHOR

...view details