ICC Soft Signal : వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నేపథ్యంలో ఆంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మైదానంలో ఎన్నో వివాదాలకు కారణమైన 'సాఫ్ట్ సిగ్నల్' నిబంధనను తొలగించింది. అయితే ఇదివరకు క్రికెట్లో క్యాచ్ ఔట్ల విషయంలో చాలా సార్లు ఈ సాఫ్ట్ సిగ్నల్ అంశం వివాదంగా మారింది. ఈ సాఫ్ట్ సిగ్నల్ నిబంధన కారణంగా ఎన్నో మ్యాచ్‌ల ఫలితాలు మారాయి. ఈ విషయమై పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదాలకు ఇప్పుడు తెర పడింది. సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను తొలగించే ప్రతిపాదనకు సౌరభ్ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మ్యాచ్ జరుగుతున్నప్పుడు, గ్రౌండ్లో సహజంగా వెలుతురు తక్కువ అయినప్పుడు ఫ్లడ్ లైట్లను ఉపయోగించి ఆటను కొనసాగించేలా కూడా ఐసీసీ మార్పులు తెచ్చింది.
ఇంతకీ ఎంటా సాఫ్ట్ సిగ్నల్ నిబంధన..మ్యాచ్‌లో బ్యాటర్ ఔట్ అయిన విధానం పట్ల ఫీల్డ్ అంపైర్‌కు సందేహం ఉంటే థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తాడు. అయితే ఇది మామూలే. కానీ ఫీల్డ్ ఫీల్డ్ అంపైర్ అలా థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసేటప్పుడు.. అది ఔట్? నాటౌట్? అని ఎదైనా ఒకటి తన నిర్ణయంగా సాఫ్ట్ సిగ్నల్ రూపంలో చెప్పాలి. అలా ఫీల్డ్ అంపైర్ తన అభిప్రాయాన్ని థర్డ్ అంపైర్‌కు వెల్లడించటమే 'సాఫ్ట్ సిగ్నల్' నిబంధన. అయితే రివ్యూలో థర్డ్ అంపైర్‌కు స్పష్టత రానప్పుడు.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను పరిగణలోకి తీసుకొనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు థర్డ్ అంపైర్. ఇలా చాలా సార్లు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కు కట్టుబడి థర్డ్ అంపైర్ ప్రకటించిన తీర్పు పట్ల అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.