ICC New Rules 2023 :ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల ప్రతిపాదించిన 'స్టాప్ క్లాక్' నిబంధన డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్ - ఇంగ్లాండ్ మధ్య బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్ నుంచే ప్రయోగాత్మకంగా ఈ రూల్ అమలు కానున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. వైట్ బాల్ క్రికెట్లో ఆట వేగాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది.
ఏంటీ 'స్టాప్ క్లాక్' రూల్?
బౌలింగ్ జట్టు ఒక ఓవర్ వేసిన తర్వాత, తదుపరి ఓవర్ 60 సెకండ్లలో వేయాలి. అలా కాకుండా నిర్దేశించిన సమయంలోపు నెక్ట్స్ ఓవర్ ప్రారంభం కాకపోతే, రెండుసార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. అదే పొరపాటు మూడోసారి కూడా జరిగితే, బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. ఈ 5 పరుగులను బ్యాటింగ్ జట్టు స్కోర్‌లో కలుపుతారు.
England Tour Of West Indies 2023: ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ - వెస్టిండీస్ మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే తాజాగా ఆతిథ్య జట్టు వెస్టిండీస్ 2-1 తేడాతో సిరీస్ నెగ్గింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గిన విండీస్, టీ20ల్లోనూ అదే జోరు ప్రదర్శించాలని చూస్తోంది.