ICC Announces Prize Money : మహిళల క్రికెట్ జట్లకు ఐసీసీ శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే అన్ని ఈవెంట్లలో ప్రైజ్ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐసీసీ ఈవెంట్లలో పురుష క్రికెట్ జట్లు, మహిళల క్రికెట్ జట్లకు సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో విధించే ఓవర్ రేట్ ఆంక్షల్లో కూడా మార్పులు చేసినట్లు తెలిపింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు.
ICC Equal Prize Money : క్రికెట్‌లో లింగ సమానత్వం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే బీసీసీఐ నిర్వహించే ప్రతి క్రికెట్ టోర్నీల్లోనూ పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వేతనాలు అందిస్తున్నారు. ఈ సమానత్వం ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే మెగా ఈవెంట్లల్లో కూడా కనిపించాలని బీసీసీఐ ఓ ప్రతిపాదనను ఐసీసీ పెద్దల ముందుంచుంది. దీనిని నిశితంగా పరిశీలించిన ఐసీసీ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందిస్తూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకుంది.