టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీతో తనకున్న అనుబంధం గురించి సురేశ్ రైనా మరోసారి గుర్తు చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్‌కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటన గురించి వివరించాడు. ఐర్లాండ్‌లో ధోనీభాయ్‌తో శీతల పానీయాలు తెప్పించుకున్నానని, కిట్ బ్యాగు మోయించానని వెల్లడించాడు.
2016లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై నిషేధం విధించడం వల్ల 'రైజింగ్ పుణె 'కు ధోనీ, 'గుజరాత్ లయన్స్'కు రైనా సారథ్యం వహించారు. అప్పుడు పుణెతో ఆడినప్పుడు విచిత్రమైన అనుభూతి కలిగిందని రైనా పేర్కొన్నాడు.
"అవును, అప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. రాజ్‌కోట్‌లో ఆడటం నాకు గుర్తుంది. అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో మెక్‌కల్లమ్ ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నా. ధోనీ భాయ్ కీపింగ్ చేస్తున్నాడు. డుప్లెసిస్ ఫస్ట్ స్లిప్‌లో నిలబడ్డాడు. వాళ్లంతా అప్పటివరకు సీఎస్క్ జట్టులో ఉన్నవారే. అందుకే, మా పొరుగింటి వాళ్లతో లీగ్ ఆడినట్టు అనిపించింది. పైగా నేను క్రీజులోకి వెళ్లినపుడు 'రండి.. రండి.. కెప్టెన్ సాబ్' అని ధోనీ పలకరించాడు. 'వస్తున్నాను భాయ్.. ముందు మీరు జరగండి' అని నేను బదులిచ్చాను" అని రైనా తెలిపాడు.
2018లో ఐర్లాండ్ వెళ్లినప్పుడు మరో సంఘటన జరిగిందని రైనా చెప్పాడు. "ఆ మ్యాచులో ధోనీ భాయ్ నాకు శీతల పానీయాలు అందించాడు. నేను ప్రతిసారీ గ్లోవ్స్, బ్యాట్ల కోసం పిలుస్తుండటం వల్ల అతడు నా కిట్‌బ్యాగ్ మొత్తం మోసుకొచ్చాడు. 'ఏం కావాలో తీసుకో. మళ్లీ మళ్లీ పిలవకు. ఇక్కడ చలిగా ఉంది' అని అన్నాడు. నేను నవ్వుతూ.. 'ఐతే ఓ పనిచేయి. నా హ్యాండ్ గ్రిప్ తీసుకుకొని రా' అని చెప్పాను. 'భలే మనిషివి దొరికావు. ముందు నీళ్లు తాగు. తీసుకొస్తా,' అని వెళ్లాడు. ఈ రోజు మహీభాయ్ నాకు దొరికాడు అని సంతోషించా' అని రైనా పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:ఒక్క మ్యాచ్.. రెండు ఘనతలు- ధావన్ అందుకునేనా?
యువీ స్థానంలో నేను..