దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు(2007 T20 World cup) తనను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ఆశించినట్లు తెలిపాడు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh). ఈ మెగాఈవెంట్ను సచిన్, ద్రవిడ్, గంగూలీ సీరియస్‌గా తీసుకోలేదని, అందుకే తనకు పగ్గాలు అప్పగిస్తారని భావించినట్లు వెల్లడించాడు.
"వన్డే ప్రపంచకప్‌లో(ODI World Cup) ఘోర పరాజయాల తర్వాత భారత క్రికెట్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ మెగాఈవెంట్ తర్వాత రెండు నెలలు ఇంగ్లాండ్ పర్యటన, ఓ నెల పాటు దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ టూర్లు.. అనంతరం టీ20 వరల్డ్‌కప్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. దాంతో.. దాదాపు నాలుగు నెలలు క్రికెటర్లు ఇళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. సీనియర్ క్రికెటర్లు బ్రేక్ తీసుకోవాలని ఆశించారు. టీ20 ప్రపంచకప్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పగ్గాలు నాకు అప్పగిస్తారని భావించా. కానీ అనూహ్యంగా ధోనీని కెప్టెన్‌గా ప్రకటించారు. ఏదేమైనప్పటికీ కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరికీ మద్దతునివ్వాలి. అది రాహుల్(Rahul Dravid), గంగూలీ(Ganguly) ఎవరైనా. చివరికి జట్టు కోసం ఉండాలి. నేను అలాగే ఉన్నా."