Ashwin Last Test: గతేడాది న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా తాను మళ్లీ క్రికెట్ ఆడతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నానని.. అప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కలిగిందని టీమ్ఇండియా సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తాజాగా అతడు టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పి హర్భజన్‌సింగ్ (417)ను అధిగమించాడు. కాన్పూర్ వేదికగా కివీస్‌తో ఆడిన తొలి టెస్టులో అశ్విన్ సోమవారం 419వ వికెట్ సాధించడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అశ్విన్.
"క్రైస్ట్‌చర్చ్ వేదికగా 2020 ఫిబ్రవరి 29న న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా తలపడిన రెండో టెస్టులో నేను ఆడలేదు. దీంతో ఆరోజే నేను మళ్లీ క్రికెట్ ఆడతానా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయా. నా భవిష్యత్ ఎటు పోతుంది? నేను ఆడే ఏకైక ఫార్మాట్ టెస్టు క్రికెట్. అందులో మళ్లీ కొనసాగుతానా? అనిపించింది. కానీ, దేవుడు నా పట్ల దయ చూపించాడు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని మళ్లీ రాణించా. తర్వాత నేను నీ (శ్రేయస్) సారథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఐపీఎల్ ఆడాను. అక్కడి నుంచే నా పరిస్థితులు మారిపోయాయి" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.