టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులో మార్పులు చేయాలంటూ వాదనలు వినిపించాయి. ముఖ్యంగా ఈ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీలో మార్పులు చేయాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీంతో.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను.. టీ20ల నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది. వైట్‌బాల్ ఫార్మాట్‌లో భారత నెక్స్ట్ కెప్టెన్‌గా పాండ్యా బాధ్యతలు అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
"వన్డే , టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని మేం ప్రణాళికలు వేస్తున్నాం. పాండ్యాతో కూడా చర్చించాం. అయితే, దీనిపై స్పందించేందుకు తనకు కొంత సమయం కావాలని అతడు కోరాడు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆలోచనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి" అని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కాగా.. బుధవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఈ భేటీలో టీ20/వన్డే కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. "అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో ఈ అంశం లేదు. దీనిపై చర్చ కూడా జరగలేదు. కెప్టెన్సీపై కేవలం సెలక్షన్ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది" అని ఆ అధికారి వెల్లడించారు.