Surya Kumar Yadav Glen Maxwell: సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడిది ఓ బ్రాండ్.. టీ20 ఫార్మాట్‌లో సంచలన బ్యాటింగ్‌తో నంబర్‌వన్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా ఆటగాడు. భారత టీ20 లీగ్‌లోనూ ముంబయి తరఫున అదరగొట్టేసే సూర్య కుమార్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి సూర్యకుమార్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు.
'సూర్యకుమార్‌కు మా లీగ్‌లో నో ఛాన్స్.. కొనేందుకు ఇక్కడ డబ్బులు లేవు' - సూర్యకుమార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వ్యాఖ్య
ఇప్పుడు ఎక్కడ చూసినా సూర్యకుమార్ పేరు మారుమోగిపోతోంది. టీ20 ఫార్మాట్‌లో అదరగొట్టేస్తున్నాడు. విభిన్నషాట్లతో మైదానం నలువైపులా షాట్ల కొడుతూ మిస్టర్ 360 ఆటగాడిగా పేరొందాడు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే?
"న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన రెండో టీ20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ తర్వాత స్కోర్ కార్డును పరిశీలించి ఫించ్‌కు ఓ ఫొటో పంపా. అసలేం జరుగుతోంది..? సూర్యకుమార్ ఏదో ఇతర గ్రహం మీద బ్యాటింగ్ చేసినట్లు ఉంది. మిగతా అందరి పరుగులను కాకుండా కేవలం సూర్యకుమార్ స్కోరునే చూస్తే మతిపోయింది. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. మరుసటి రోజు మ్యాచ్ రిప్లేను చూశా. ఇతర బ్యాటర్ల కంటే సూర్య ఎందుకు ప్రత్యేకమో చెప్పాలంటే కష్టంగానే ఉంది. ఆటగాడిగా చూడటానికే కష్టంగా అనిపించింది.. అలాంటి ప్రదర్శనకు మేం చాలా దూరంలో ఉండిపోయాం" అని మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
ఆస్ట్రేలియా వేదికగా బిగ్‌బాష్ లీగ్ జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్‌బాష్ లీగ్‌లోకి సూర్యకుమార్‌ను తీసుకొనే అవకాశం ఏమైనా ఉందా..? అనే ప్రశ్నకు మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. "సూర్యను దక్కించుకొనేందుకు సరిపడేంత సొమ్ము మా దగ్గర లేదు (నవ్వుతూ). అందులో ఎలాంటి అవకాశం లేదు. దానికోసం జట్టులోని ప్రతిఆటగాడిని తీసేయాలి. లేకపోతే ఆసీస్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాడినైనా తప్పించాలి" అని వ్యాఖ్యానించాడు. అయితే భారత క్రికెటర్లు ఇతర దేశాల్లో లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాతే ఆ అవకాశం ఉంటుంది.