Gavaskar on Pujara and Rahane: టీమ్‌ఇండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె.. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని మాజీ సారథి, బ్యాటింగ్ దిగ్గజం సునీల్‌గావస్కర్ ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ అర్ధశతకాలతో రాణించారు. దీంతో మూడో వికెట్‌కు 111 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గావస్కర్.. పుజారా-రహానె బ్యాటింగ్‌పై స్పందించాడు.
"వారిద్దరికీ ఉన్న అనుభవం, గతంలో జట్టుకు అందించిన విజయాల నేపథ్యంలోనే టీమ్‌ఇండియా వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించింది. అవసరమైన వేళ వారిద్దరూ రాణిస్తారనే నమ్మకం ఉంచింది. అందుకు తగ్గట్టే రెండో ఇన్నింగ్స్‌లో రాణించి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కొన్నిసార్లు మనం సీనియర్ల పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్‌బెంచ్‌లో పలువురు నైపుణ్యమున్న యువకులు తమ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఎలా ఆడతారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ సీనియర్లు ఇద్దరూ మరీ ఘోరంగా విఫలమవ్వనంతకాలం.. జట్టు అండగా ఉంటూ ఇలాగే నమ్మకం ఉంచాలని నేను అనుకుంటున్నా."
-- సునీల్ గావస్కర్, మాజీ ఆటగాడు.
రెండో టెస్టులో టీమ్‌ఇండియా 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (96*) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. వాండర్ డెస్సన్ (40), తెంబా బవుమా (23*) రాణించారు.