Virat Kohli on Jaspreet Bumra: జస్‌ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన పేసర్. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ బౌలింగ్ అస్త్రం అతడే. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు కూల్చే అలాంటి పేసర్ ఉండాలని ఏ జట్టయినా కోరుకుంటుంది. కానీ అతని కెరీర్ ఆరంభంలో బుమ్రా గురించి చెప్తే కోహ్లీ పట్టించుకోలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ వెల్లడించాడు.
"2014లో నేను ఆర్సీబీ జట్టులో ఉన్నపుడు బుమ్రా గురించి కోహ్లీకి చెప్పా. అతనిపై ఓ కన్నేయమని సూచించా. కానీ విరాట్ మాత్రం.. 'వదిలేయ్.. బుమ్రా- వుమ్రా లాంటి ఆటగాళ్లు ఏం చేస్తారు' అని బదులిచ్చాడు. మొదట్లో బుమ్రా మూడేళ్ల పాటు రంజీల్లో ఆడాడు. ఆరంభ సీజన్ 2013 నుంచి 2015 వరకు రాణించలేదు. దీంతో అతణ్ని సీజన్ మధ్యలోనే ఇంటికి పంపిద్దామనే చర్చలు సాగాయి. కానీ బుమ్రా నెమ్మదిగా మెరుగయ్యాడు. ముంబయి ఇండియన్స్ అతనికి మద్దతుగా నిలిచింది. సొంత కష్టంతో పాటు ముంబయి మద్దతుతో తనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది"