తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్‌ పాక్‌ జట్టులో ఉండుంటే ఇలా జరిగేదా? : పాక్‌ మాజీ పేసర్‌

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్​ మాజీ పేసర్ టీంఇండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతకీ ఎమన్నాడంటే..?​

rishab panth
రిషబ్​ పంత్​

By

Published : Oct 30, 2022, 9:29 PM IST

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ వైఫల్యాలపై జట్టు కప్టెన్‌, సెలక్షన్‌ కమిటీని అక్కడి అభిమానులు, మాజీ ఆటగాళ్లు తప్పుపడుతున్నారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తాజాగా పాక్‌ మాజీ పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఎంపికలో భారత్‌- పాక్‌ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నాడు. పంత్‌ లాంటి చురుకైన ఆటగాడిని సైతం ఈ టోర్నీ కోసం పక్కన పెట్టిన టీమ్‌ఇండియా నిర్ణయాన్ని కొనియాడాడు. అదే స్థానంలో పాక్‌ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇంతటి తెగువ చూపదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికైనా భారత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు.

"ఎం.ఎస్‌ ధోనీ తర్వాత టీమ్‌ఇండియాలో రిషభ్‌ పంత్‌ ఆ స్థాయి వికెట్‌ కీపర్‌. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అలాంటి ఆటగాడిని దినేశ్‌ కార్తీక్‌ కోసం సెలక్టర్లు పక్కనపెట్టారు. పంత్‌ సామర్థ్యం ఎలాంటిదో వారికి తెలుసు. జట్టులో ఉండుంటే పరుగులతో రాణించేవాడు. సిక్సులు కొట్టేవాడేమో. కానీ ఫినిషింగ్‌లో తడబడితే టీమ్‌ఇండియా నష్టపోయేది. వారికి సరైన ఫినిషర్‌ అవసరం. ఆ ఒక్క కారణంతో వారు కార్తీక్‌ను ఎంపికచేసుకున్నారు. ఒకవేళ పంత్‌ పాక్‌ జట్టులో ఉండుంటే ఇలా జరిగేదా? జట్టు అవసరాల కోసం ఇటువంటి నిర్ణయం తీసుకునేవారా? అవకాశమే లేదు"అంటూ విమర్శించాడు. పక్కనే ఉన్న మరో మాజీ ఆటగాడు మహమ్మద్‌ అమిర్‌ మాట్లాడుతూ రియాజ్‌ వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. "రవీంద్ర జడేజా జట్టుకు దూరమైనప్పుడు కూడా అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌కు వారు అవకాశం కల్పించారు. అంతేకానీ మరో బౌలర్‌ కోసం చూడలేదు. టీమ్‌ఇండియా ఆటకు అంతటి ప్రాధాన్యం ఇస్తుంది" అంటూ ప్రశంసించాడు.

ABOUT THE AUTHOR

...view details