గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడటం సాధారణమే. కానీ ప్రస్తుతం పోటీ కాస్త భిన్నంగా మారింది. ఆటగాళ్లతో పాటు మాజీలూ విజయం కోసం తలపడుతున్నారు. అయితే మాజీలు పోరాడేది మాత్రం నెట్టింట్లో. తమ జట్టుకు మద్దతుగా నిలుస్తూ, క్రికెట్ అభిమానులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. దీన్ని నెటిజన్లు కూడా ఎంతో ఆస్వాదిస్తున్నారు.
భారత మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, వసీమ్ జాఫర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా హాస్య చతురతతో పోస్ట్‌లు చేస్తుంటారు. ఇక మైకేల్ వాన్, మైకేల్ క్లార్క్, రికీ పాంటింగ్ ప్రత్యర్థి జట్టును తక్కువగా అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. తర్వాత తమ అంచనా తప్పని గుర్తిస్తుంటారు. అయితే.. తాజాగా పీటర్సన్, జాఫర్ మధ్య జరిగిన 'ట్విటర్ పోరు' నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో పీటర్సన్ టీమిండియా అభిమానులను కవ్విస్తూ ఓ ట్వీట్ చేశాడు. "భారత్‌కు శుభాకాంక్షలు.. 'ఇంగ్లాండ్-బి' జట్టును ఓడించినందుకు" అని ట్వీటాడు. దీనికి జాఫర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.