ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో పట్ల.. జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై 'సిగ్గుపడాలని' మాజీ సారథి జెఫ్రీ బాయ్‌కాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో రెండు టెస్టులు ఆడిన బెయిర్‌స్టోను పనిభారం తగ్గించే పేరిట ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో బాయ్‌కాట్ ఇంగ్లాండ్ బోర్డుపై మండిపడ్డాడు. లంక పర్యటనలో బాగా ఆడిన బెయిర్‌స్టోను కోహ్లీసేనతో తొలి రెండు టెస్టులకు దూరం పెట్టడం సరికాదన్నాడు.
మరోవైపు రెండో టెస్టుకు జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి బెన్ ఫోక్స్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించడంపైనా బాయ్‌కాట్ విమర్శలు గుప్పించాడు. 'ఇండియాతో తదుపరి మూడు టెస్టులకు బట్లర్‌కు విశ్రాంతినిచ్చింది ఇంగ్లాండ్ బోర్డు. అయితే, వికెట్ కీపర్‌గా బెన్ ఫోక్స్‌కు అవకాశం కల్పించింది. బెయిర్‌స్టో.. బ్యాట్స్‌మన్, కీపర్‌గా ఆడటం ఇంగ్లాండ్ చీఫ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్‌కు ఇష్టం లేదు. అందుకే అతడు ఫోక్స్‌కు అవకాశమిచ్చాడు' అని బాయ్‌కాట్ ఓ అంతర్జాతీయ పత్రికతో అన్నాడు.