తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: ప్రపంచకప్​లో భారత ఆల్​టైమ్ బెస్ట్​ టీం​ ఇదే.!

సచిన్ ​తెందూల్కర్​ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.. గంగూలీ వన్డేల్లో ఉత్తమ ఓపెనర్.. కపిల్​దేవ్ బెస్ట్​ ఆల్​రౌండర్.. ధోని ఉత్తమ వికెట్​ కీపర్​.. మరి వీరందరితో ప్రపంచకప్​ ఆల్​టైమ్​ బెస్ట్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం!

ప్రపంచకప్ జట్టు

By

Published : May 22, 2019, 8:41 AM IST

Updated : May 22, 2019, 9:19 AM IST

భారత్ మొదటిసారి ప్రపంచకప్​ను ముద్దాడిన సంఘటన ఓ పదేళ్ల కుర్రాడి జీవితాన్ని మార్చివేసింది. అది చూసిన ఆ పిల్లాడు ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్రవేశాడు. అతడే సచిన్ తెందూల్కర్​. సచిన్​పై అంతగా ప్రభావం చూపింది వరల్డ్​కప్. ఇప్పటివరకు ఇలా ఎందరినో ప్రభావితం చేసిన వరల్డ్​కప్​లో అత్యుత్తమ 11 మంది భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం!

సచిన్ తెందూల్కర్.. ఓపెనర్

సచిన్

1992 నుంచి 2011 వరకు ఆరు ప్రపంచకప్​లు ఆడాడు సచిన్. మొత్తం మెగాటోర్నీల్లో 2278 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 15 అర్ధ సెంచరీలున్నాయి. ప్రపంచకప్​లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్​ రికార్డు సృష్టించాడు. 1996, 2003 మెగాటోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్​కప్​ను ముద్దాడాలన్న తన కలను చివరికి 2011లో తీర్చుకున్నాడు. ఆల్​టైమ్ ఉత్తమ వన్డే క్రికెటర్​గా కీర్తినిగడించాడు మాస్టర్​.

సౌరవ్​ గంగూలీ.. రెండో ఒపెనర్

గంగూలీ

ప్రపంచకప్​ టోర్నీల్లో 1006 పరుగులు చేశాడు గంగూలీ. ఇందులో 4 శతకాలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1999లో తొలిసారి ప్రపంచకప్​ ఆడాడు సౌరవ్. ఈ టోర్నీలోనే శ్రీలంకపై అత్యధికంగా 183 పరుగులు చేశాడు. 2003లో తన కెప్టెన్సీలో జట్టును రన్నరప్​గా నిలిపాడు. సెమీస్​లో కెన్యాపై చేసిన శతకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రపంచకప్​లో భారత్​ తరపున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంగూలీ ఘనత సాధించాడు. రెండో ఓపెనర్​గా సరిపోతాడు.

రాహుల్ ద్రవిడ్.. వన్​డౌన్​

ద్రవిడ్

ఉత్తమ వన్డే ఆటగాళ్లలో అతితక్కువ మందిలో ఒకడు రాహుల్ ద్రవిడ్​. ఆడిన ప్రపంచకప్​ టోర్నీల్లో రెండు శతకాలు, ఆరు అర్ధసెంచరీలతో 860 పరుగులు చేశాడు. 1999 ప్రపంచకప్​ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2003లో భారత్​ ఫైనల్​ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. మూడో స్థానానికి పర్​ఫెక్ట్​గా సూటౌతాడు ద్రవిడ్​.

మెహిందర్ అమర్​నాథ్​... మిడిల్ ఆర్డర్​/ ఆల్​రౌండర్​

మొహిందర్ అమర్​నాథ్

1983 ప్రపంచకప్​ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు మెహిందర్ అమర్​నాథ్. ప్రపంచకప్​ టోర్నీల్లో 254 పరుగులతో పాటు 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 1983 ప్రపంచకప్​ సెమీస్​లో మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కించుకున్నాడు. బ్యాట్​తోనే కాకుండా బంతితోనూ మాయచేయగలడు అమర్​నాథ్​.

మహమ్మద్ అజారుద్దిన్​.. మిడిల్ ఆర్డర్​

అజారుద్దీన్

మూడు ప్రపంచకప్​ టోర్నీల్లో భారత జట్టు​కు కెప్టెన్​గా వ్యవహరించాడు అజారుద్దిన్​. 39.33 సగటుతో 826 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధశతకాలున్నాయి. 1996 వరల్డ్​కప్​లో భారత్​ సెమీస్​ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్​లో బలమైన ఆటగాడిగా సత్తా చాటుతాడు.

యువరాజ్ సింగ్.. బ్యాటింగ్ ఆల్​రౌండర్​

యువరాజ్ సింగ్​

బ్యాటింగ్​తో అదరగొట్టే యువరాజ్ తన స్పిన్​ మాయాజాలంతోనూ ఆకట్టుకోగలడు. ప్రపంచ కప్​ టోర్నీల్లో 52.71 సగటుతో 738 పరుగులు చేశాడు. అంతేకాదు 20 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 వరల్డ్​కప్​ సీజన్​లో మ్యాన్ ఆఫ్​ ద సిరీస్​ అవార్డు దక్కించుకున్నాడు.

మహేంద్ర సింగ్ ధోని... వికెట్ కీపర్​/వైస్​ కెప్టెన్

ధోనీ

వన్డే క్రికెట్​లో ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్​మెన్ మహేంద్ర సింగ్ ధోని. ప్రపంచకప్​ టోర్నీలో 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలున్నాయి. 2011 ప్రపంచకప్​ను భారత్​.. ధోని సారథ్యంలోనే గెలిచింది. స్టంపింగ్​లు, క్యాచ్​లు, రనౌట్​లతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. 2015లోనూ భారత్​ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు ధోని.

కపిల్ దేవ్.. కెప్టెన్​/ఆల్​రౌండర్​

కపిల్ దేవ్

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్​రౌండర్​ ఎవరని అడిగితే మొదట చెప్పే పేరు కపిల్​ దేవ్. ప్రపంచ కప్​ టోర్నీల్లో 669 పరుగులతో పాటు 28 వికెట్లు తీశాడు కపిల్. 1983 ప్రపంచకప్​ను కపిల్​ సారథ్యంలోనే గెల్చుకుందిభారత్. ఆ టోర్నమెంట్​లో జింబాబ్వేపై 175 వ్యక్తిగత పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు కపిల్​.

జవగల్​ శ్రీనాథ్... పేసర్​

జవగళ్ శ్రీనాథ్

1996, 1999, 2003 మూడు ప్రపంచకప్​లు ఆడిన జవగల్​ శ్రీనాథ్ భారత్​కు బెస్ట్ పేసర్​. వరల్డ్​కప్​ టోర్నీల్లో 27.81 సగటుతో 44 వికెట్లు తీశాడు. 1996 ప్రపంచకప్​లో భారత్ సెమీస్​ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2003 భారత జట్టులో కీలక సభ్యుడు.

అనిల్ కుంబ్లే.. స్పిన్నర్​

అనిల్ కుంబ్లే

ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్​ స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 22.83 సగటుతో 31 వికెట్లను తీశాడు. 1996 టోర్నీలో భారత్​ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

జహీర్ ఖాన్.. పేస్ బౌలర్​

జహీర్​ఖాన్​

భారత్​కున్న మరో అత్యుత్తమ పేసర్​ జహీర్​ఖాన్. తన రివర్స్ స్వింగ్​తో ప్రత్యర్థులను బెంబేలెత్తించగల సమర్థుడు. మూడు ప్రపంచకప్​ లాడిన జహీర్ 20.22 సగటుతో 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఉప ఖండపు పిచ్​ల్లో తనదైన శైలిలో రెచ్చిపోతాడు జహీర్​.

విరాట్ కోహ్లి.. 12వ ఆటగాడు

కోహ్లీ

ప్రస్తుతం భారత్ కెప్టెన్​గా ఉన్న విరాట్​ కోహ్లి.. 41.92 సగటుతో 587 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్​ను గెలిపించగల సమర్థుడు విరాట్​. వన్డేల్లో వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు.

1983లో ప్రపంచకప్​ను తొలిసారి అందుకున్న టీమిండియా తర్వాత ఆ కోరిక తీర్చుకోవడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది. 2011లో ధోనీ సారథ్యంలోని మెన్​ ఇన్ బ్లూ రెండో సారి ప్రపంచకప్​ గెలుచుకుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30న ప్రపంచకప్​ 12వ సీజన్​ ప్రారంభం కానుంది.

Last Updated : May 22, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details