ప్రపంచకప్‌లో మంచి జోష్ మీదున్న భారత్ రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సొంతం చేసుకోగా ఒక మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. శనివారం పసికూన అఫ్గానిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. కోహ్లీ బృందం మైదానంలో తీవ్రంగా కష్టపడింది. ఈ సందర్భంగా కొందరు ఆటగాళ్లు ఫుట్‌బాల్‌తోనూ సరదాగా ప్రాక్టీస్ చేశారు. కిందపడకుండా బంతిని 41 సార్లు గాల్లోనే ఉంచారు. ఈ వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది.
మ్యాచ్‌కు సిద్ధమైన శంకర్...
భారత ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ గురువారం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్‌లో గాయపడ్డాడు. తర్వాత సెషన్ ప్రాక్టీస్ చేయనప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని యాజమాన్యం తెలిపింది. శుక్రవారం అన్ని పరీక్షలు చేసి తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌కు విజయ్ శంకర్‌కు విశ్రాంతి నిచ్చి పంత్‌కు అవకాశం ఇస్తారని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
సునాయసంగా చేరాలంటే...
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే టీమిండియా సునాయాసంగానే సెమీస్ చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లతో మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. ప్రస్తుతం బంగ్లా బ్యాట్స్‌మెన్ జోరుమీద ఉన్నారు. 300 పై చిలుకు స్కోర్లను అలవోకగా బాదేస్తున్నారు కాబట్టి వారితో ఆడబోయే మ్యాచ్‌లో టీమిండియా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జూన్ 30న ఇంగ్లాండ్‌తో గెలిస్తే.. శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్‌ల కన్నా భారత్ బలమైన జట్టు కావడం విజయంపై ధీమాగా ఉన్నారు భారత అభిమానులు.