టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో సెంచరీ చేసి అదరగొట్టిన శిఖర్... మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఎడమచేతి బొటన వేలుకు దెబ్బతగలడం వల్ల మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించింది జట్టు యాజమాన్యం. స్కానింగ్‌లో గాయం పెద్దదిగా తేలింది. మూడు వారాలు విశ్రాంతి సూచించారు వైద్యులు. ఫలితంగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకోవలసి వచ్చింది.
ఏం జరిగింది..?
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్‌నైల్ విసిరిన బంతి గబ్బర్ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడ్డప్పటికీ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత నొప్పితో వేలు వాచింది. ఆ నొప్పి వల్ల ఆసీస్ మ్యాచ్‌లో గబ్బర్ ఫీల్డింగ్ చేయలేదు. ధావన్ స్థానంలో 50 ఓవర్లు రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు.
గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు మిగిలిన వాటికి రాహుల్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.