మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రెఫోర్డ్ స్టేడియం పిచ్ సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తుంది. కానీ ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ చూస్తే బ్యాట్స్‌మెన్ బాగానే పరుగులు చేస్తున్నారు. రోహిత్ శతకంతో, రాహుల్ అర్ధశతకంతో అదరగొట్టారు. పాకిస్థాన్ స్పిన్నర్లను ఓ ఆటాడుకుంటూ కోహ్లీసేన రన్స్ చేస్తోంది. ఇదే నిలకడ ప్రదర్శిస్తే టీమిండియా... ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంది.
మాంచెస్టర్‌లో వర్షం నిల్... పరుగులు ఫుల్
ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నడుమ పూర్తిస్థాయి మ్యాచ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఘనంగా ఆరంభమైన ఈ పోరులో భారీగా పరుగుల వరద పారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ స్టేడియంలో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ ఇంగ్లాండ్ X శ్రీలంక మధ్య 318/7గా నమోదైంది. అత్యల్ప స్కోర్ ఇంగ్లాండ్ x కెనడా మధ్య 45/10 రికార్డు ఉంది. అయితే ఇదే ఆతిథ్య జట్టు-న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరులో 286/4 అత్యధిక ఛేదనగా నిలిచింది.
మ్యాచ్ సమయంలో వరుణుడు విజృంభించే అవకాశం ఉందని తొలుత అందరూ ఆందోళన చెందినా... అలా జరగలేదు. ప్రస్తుతం మ్యాచ్ సజావుగానే సాగుతోంది. వర్షం కురవకపోతే పూర్తిస్థాయి ఆట జరిగే అవకాశముంది. ఇప్పటికే వరుణుడు కారణంగా ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.