లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓ మాదిరి స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 179 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (54), హార్ధిక్ పాండ్య (30) మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. ఆరంభం నుంచి కివీస్ బౌలర్లు భారత్‌పై ఆధిపత్యం చెలాయించారు. బౌల్ట్ 4 వికెట్లు తీయగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
భారత్ ఇన్నింగ్స్ మొదటి నుంచి పేలవంగా సాగింది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (2)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు బౌల్ట్. అనంతరం వెంటవెంటనే శిఖర్ ధావన్ (2), కే ఎల్ రాహుల్‌ను (6) పెవిలియన్ చేర్చి భారత్‌ను దెబ్బతీశాడు. విరాట్‌ను (18) గ్రాండ్‌హోమ్ బౌల్డ్ చేశాడు.
39కే నాలుగు వికెట్ల కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది భారత్. ఈ సమయంలో హార్ధిక్ పాండ్య (30), ధోనీ కాసేపు నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని ఆపారు. వేగంగా ఆడుతూ నీషమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పాండ్య. అనంతరం ధోని కూడా సౌధీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
జడ్డు అర్ధశతకం...
చివర్లో జడేజా కుల్దీప్ను (19) అడ్డుపెట్టుకుని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వేగంగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. పరుగులు చేసేందుకు కష్టమైన పిచ్‌పైనే చక్కటి ప్రదర్శన చేశాడు. కుల్దీప్ నిలకడగా ఆడి జడేజాకు సాయపడ్డాడు. వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో జడేజా ఔటయ్యాడు. ఆ వెనువెంటనే కుల్దీప్ పెవిలియన్ చేరాడు. భారత్ ఇన్నింగ్స్ 179 పరుగుల వద్ద ముగిసింది.