ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ పోరులో నెగ్గి టీమిండియా వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకుంది. 315 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్ 286 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో షకిబ్(66, 74 బంతుల్లో), సైఫుద్దీన్(51*, 38 బంతుల్లో) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. మిగతా వారు ఓ మోస్తరుగా ఆడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీశాడు. పాండ్య 3.. భువి, చాహల్, షమీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాపార్డర్ టాప్ లేపారు..
315 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లా ఆరంభంలో నిలకడగా ఆడింది. పది ఓవర్లకు 40 పరుగులు చేసింది. పదో ఓవర్లో తమీమ్‌ను ఔట్ చేసిన షమి బంగ్లాను దెబ్బతీశాడు. కాసేపటికే మరో ఓపెనర్ సౌమ్యా సర్కార్‌ను పెవిలియన్ చేర్చాడు పాండ్య. అనంతరం వచ్చిన షకిబ్ - ముష్ఫీకర్ జోడి నిలకడగా ఆడింది. ముష్ఫీకర్‌ను(24) ఔట్ చేసి బంగ్లాను దెబ్బతీశాడు చాహల్. కొద్ది విరామంలో లిటన్ దాస్(22), మోసాదేక్ హోస్సెన్(3) పెవిలియన్ బాట పట్టారు.
అనంతరం బంగ్లా ఆల్‌రౌండర్ షకిబుల్ నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. 74 బంతుల్లో 66 పరుగులు చేశాడు. కాసేపటికి పాండ్య బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.