ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లంక 264 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలో దిగిన భారత ఓపెనర్లు విజృంభించారు. రోహిత్(103), రాహుల్(111) శతకాలతో చెలరేగి భారత్‌కు విజయాన్ని చేకూర్చారు. లంక బౌలర్లలో మలింగ, ఇసురు ఉడానా, కసున్ రజిత తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
264 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన భారత్‌కు ఘనమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, కే ఎల్ రాహుల్ 189 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదే చేశారు. ఈ టోర్నీలో టీమిండియాకిదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇద్దరూ ఎడపెడా బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు.
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ 5వ శతకం..
92 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసిన హిట్ మ్యాన్ కెరీర్లో 27వ సెంచరీని నమోదు చేశాడు. ఓ ప్రపంచకప్‌లో అత్యధికంగా శతకాలు(5) చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక ఆటగాడు సంగక్కర(4) పేరిట ఉంది. మొత్తం వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆరు శతకాలతో ఉన్న సచిన్ రికార్డును సమం చేశాడు హిట్‌మ్యాన్.