ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓటమిపై స్పందించాడు వెస్టిండీస్ సారథి హోల్డర్. స్మిత్ అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడని కొనియాడాడు. అదే తమకు విజయాన్ని దూరం చేయడానికి ఓ కారణమని మ్యాచ్ అనంతరం వెల్లడించాడీ కరేబియన్ ఆటగాడు.
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడింది విండీస్. ఓ దశలో మ్యాచ్ గెలిచేలా కనిపించిన కరేబియన్ జట్టు.. చివర్లో స్టార్క్ ధాటికి తడబడి పరాజయం పాలైంది. తొలుత బౌలింగ్, ఫీల్డింగ్‌లో తప్పిదాలతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసేందుకు దోహదపడింది.
''మేం విజయానికి చేరువగా వచ్చి ఓ మంచి అవకాశాన్ని కోల్పోయాం. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటాం. కానీ.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినందుకు నిరాశలో ఉన్నాం.
క్రికెట్లో భాగస్వామ్యాలు ప్రధానమైనవి. అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్నైల్లను సమన్వయపరుచుకుంటూ స్మిత్ ఆడిన తీరు అద్భుతం. కౌల్టర్‌నైల్ 60 పరుగుల వద్దే అతని క్యాచ్ విడిచిపెట్టాం. అదెంత విలువైందో తర్వాతే తెలిసింది.''