తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: క్రికెట్​ 'దేవుడి' కల నెరవేరిన వేళ - ప్రపచంకప్​

28 ఏళ్ల తర్వాత ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగిన రోజు... క్రికెట్​ దేవుడి కల నెరవేరిన వేళ అది.. అలాంటి 2011 ప్రపంచకప్​ విశేషాలను చూసేద్దామా మరి..

WC 19: క్రికెట్​ 'దేవుడి' కల నెరవేరిన వేళ

By

Published : May 27, 2019, 5:27 PM IST

2011 ప్రపంచకప్​... అప్పటికి భారత్​ విశ్వవిజేతగా నిలిచి 28 ఏళ్లు గడిచిపోయింది. కపిల్​దేవ్​ నేతృత్వంలో భీకర కరేబియన్​ జట్టును ఓడించి తొలిసారి 1983లో భారత్​ ప్రపంచకప్​ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మరో ఆరు ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్​కు నిరాశే ఎదురైంది.

1983 ప్రపంచకప్​ గెలిచిన భారత్​

స్వదేశంలో జరిగిన 2011 ప్రపంచకప్​పై యావత్​ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2007 టీ20 ప్రపంచకప్​లో భారత్​ను విశ్వవిజేతగా నిలిపిన తిరుగులేని సారథి ఎంఎస్​ ధోనిపైనే అందరి నమ్మకం. వరల్డ్​కప్​ను ముద్దాడాలన్నది క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ కల. అది ఈ ప్రపంచకప్​లోనైనా నెరవేరుతుందా? క్రికెట్ దేవుడికి ఘనమైన వీడ్కోలు దక్కుతుందా? ఒత్తిడిని తట్టుకుని భారత్​ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందా? ఇన్ని ప్రశ్నల మధ్య భారత్​ టోర్నీలో అడుగుపెట్టింది.

తొలి మ్యాచ్​...

తొలి మ్యాచ్​ భారత్​- బంగ్లాదేశ్​ మధ్య జరిగింది. 2007లో బంగ్లాదేశ్​ చేతిలో భారత్​ ఓడి మెగాటోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ పరాజయం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెచ్చింది. ఆ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. టోర్నీని కళ్లు చెదిరే ఫోర్​తో ప్రారంభించాడు భారత​ విధ్వంసకర ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. బంగ్లాదేశ్​ బౌలర్లను ఉతికారేస్తూ 175 (140) పరుగులు సాధించాడు వీరూ. విరాట్​ కోహ్లీ 100 (83)తో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేశాడు.

బౌలింగ్​లో మునాఫ్​ పటేల్​ 4 వికెట్లతో చెలరేగాడు. సమష్టి ప్రదర్శనతో 87 పరుగుల తేడాతో భారత్​ జయకేతనం ఎగురవేసి టోర్నీని ఘనంగా ఆరంభించింది.

టోర్నీకే హైలైట్​...

ఇంగ్లాండ్​ X ఐర్లాండ్​ మధ్య జరిగిన మ్యాచ్​ మెగాటోర్నీలో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్ 8/327 భారీ స్కోరు చేసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్​ జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే అనూహ్యంగా ఆరో వికెట్​కు కెవిన్​ ఓబ్రెయిన్​ 113 (63), అలెక్స్​ కుసాక్​ 47 (63) జోడీ 162 పరుగులు జత చేసింది. ప్రపంచకప్​ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

కెవిన్​ ఓబ్రెయిన్​

క్వార్టర్స్​ చేరిన జట్లు..

లీగ్​ దశ ముగిశాక పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా పూల్​-ఏ నుంచి క్వార్టర్స్​ చేరాయి. పూల్​- బీ నుంచి భారత్​, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించాయి.

ఆస్ట్రేలియా X భారత్​...

క్వార్టర్స్​లో భారత్​ బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్​ చేసింది. కెప్టెన్​ రికీ పాంటింగ్​ 104 శతకంతో చెలరేగగా.. ఆసిస్​ 261 పరుగుల లక్ష్యాన్ని ధోనిసేన ముందు ఉంచింది. సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్​మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. సచిన్​ 53, గంభీర్​ 50, యువరాజ్ సింగ్ 57*, రైనా 34* పరుగులు చేశారు.

మిగిలిన క్వార్టర్స్​ ఇలా...

వెస్టిండీస్​తో తలపడి పాకిస్థాన్​ సెమీస్​ చేరింది. మరో క్వార్టర్స్​లో ఇంగ్లాండ్​ను ఓడించి శ్రీలంక సెమీస్​ బెర్త్​ నిలుపుకొంది. మెగాటోర్నీల్లో తన బలహీనతను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా మరోసారి కివీస్​కు మ్యాచ్​ అప్పగించింది.

సెమీస్​లో ఢీ అంటే ఢీ...

సెమీస్​లో న్యూజిలాండ్​ X శ్రీలంక, చిరకాల ప్రత్యర్థులైన భారత్ X పాకిస్థాన్​ తలపడ్డాయి.

మొదటి సెమీస్​లో కివీస్​ను 217 పరుగులకే ఆలౌట్​ చేసింది లంక జట్టు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో విజయం చివరకు శ్రీలంక జట్టునే వరించింది.

దాయాదుల పోరు...

మొహాలీలో జరిగిన దాయాదుల సమరానికి స్టేడియం అభిమానులతో నిండిపోయింది. మొత్తం 35 వేల మంది ఈ మ్యాచ్​ను స్టేడియంలో వీక్షించారు. ముందుగా బ్యాటింగ్​కు దిగిన భారత్​ 9/260 పరుగులు చేసింది. సచిన్​ 85 (115) పరుగులతో రాణించాడు. తెందూల్కర్ ఈ మ్యాచ్​లో మొత్తం 6 సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 క్యాచ్​లు జార విడిచారు పాక్​ ఆటగాళ్లు.

261 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్​ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 231 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ప్రపంచకప్​ టోర్నీలో ఒక్కసారి కూడా భారత్​ను ఓడించలేకపోయిన పాక్​... తన రికార్డును కొనసాగించింది.

వాంఖడే వేదికగా...

శ్రీలంక X భారత్​ మధ్య ముంబయి వాంఖడే వేదికగా ఫైనల్​ జరిగింది. ప్రపంచకప్​ చరిత్రలో తొలిసారి రెండు ఆసియా జట్లు తుదిపోరులో తలపడ్డాయి. అభిమానుల అరుపుల మధ్య రిఫరీకి టాస్​ సమయంలో ఎవరేం చెప్పారో వినపడక టాస్​ రెండోసారి వేయాల్సి వచ్చింది. టాస్​ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్​ ఎంచుకుంది. మహేలా జయవర్థనే 104 (88) సాయంతో 6/ 274 పరుగులు చేసింది లంక జట్టు.

కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల అరుపుల మధ్య భారత ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్​కు వచ్చారు. అయితే తొలి ఓవర్లోనే లసిత్​ మలింగ సెహ్వాగ్​ను ఎల్​బీడబ్లూ చేసి పెవిలియన్​కు పంపాడు. కొద్ది సేపటికే సచిన్​ను అవుట్​ చేసాడు మలింగ. స్టేడియం మొత్తం నిశబ్దం అలుముకుంది. విరాట్ కోహ్లీ​ 35 సాయంతో గౌతమ్​ గంభీర్ 97 (122) అద్భుతంగా ఆడాడు.

గౌతమ్​ గంభీర్​

కోహ్లీ వెనుదిరిగాక ఫామ్​లో ఉన్న యువరాజ్​ను కాదని కెప్టెన్​ ధోని క్రీజులోకి వచ్చాడు. చివరి వరకు నిలిచిన ధోని మైదానంలో ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డాడు. 91* పరుగులు చేశాడు. చివర్లో తన మార్కు హెలికాఫ్టర్​ షాట్​తో సిక్సర్​ బాది 28 ఏళ్ల భారత్​ నిరీక్షణకు తెరదించాడు. క్రికెట్​ దేవుడు సచిన్​ ​కల సాకారం చేశాడు.

సచిన్​ను భూజాలపై మోస్తూ భారత ఆటగాళ్లు వాంఖడేలో తిరిగిన దృశ్యాలు ఇప్పటికీ ప్రతి భారత అభిమానికి ఓ మధుర జ్ఞాపకమే.

వరల్డ్​కప్​ను పట్టుకున్న సచిన్

ఆసక్తికర విషయాలు....

  1. యువరాజ్​ సింగ్​ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో భారత్​ వరల్డ్​కప్​ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
    మ్యాన్​ ఆఫ్​ ది టార్నమెంట్​
  2. సెహ్వాగ్​ టోర్నీని ఫోర్​తో ఆరంభిస్తే... ధోని సిక్సర్​తో ముగించాడు.
  3. ప్రపంచకప్​ ఫైనల్లో సెంచరీ చేసి కూడా ఓటమి వైపు నిలిచిన జట్టులో ఉన్నవాడు జయవర్థనే ఒక్కడే.
  4. మ్యాన్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ - యువరాజ్​ సింగ్
  5. అత్యధిక పరుగులు - తిలకరత్నే దిల్షన్ ( 500)
  6. అత్యధిక వికెట్లు - షాహిద్​ అఫ్రిదీ (21)
  7. అత్యధిక స్కోరు - భారత్​ 4/370 (బంగ్లాదేశ్​తో)
  8. అత్యల్ప స్కోరు - బంగ్లాదేశ్​ 58 (వెస్టిండీస్​తో)
  9. మ్యాచ్​ ఆఫ్​ ద టోర్నమెంట్ - ఇంగ్లాండ్​ X ఐర్లాండ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details