"2019 ప్రపంచకప్‌ను భారత్ గెలుస్తుంది అందులో సందేహం లేదు... ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేత అవుతుంది, లీగ్‌లో కంగారూ జట్టు ప్రదర్శన చూస్తేనే తెలుస్తుంది". సెమీస్‌కు ముందు క్రీడా విశ్లేషకుల మాటలివి. అవి తప్పని నిరూపిస్తూ ఈ రెండింటిని ఇంటిముఖం పట్టించాయి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు. ఫైనల్లో ఈ రెండు టీమ్‌ల్లో ఒకటి తొలిసారి విశ్వవిజేత కానుంది.
కివీస్‌కు అదృష్టం కలిసొచ్చేనా...
మెగాటోర్నీలో కివీస్ 8 సార్లు సెమీస్ చేరింది. అందులో రెండు సార్లు మాత్రమే ఫైనల్ వరకు రాగలిగింది. 'కివీస్ సెమీస్‌కే పరిమితమౌతుంది, ఆ జట్టు చివర్లో ఒత్తిడిని తట్టుకోలేదు' అనే అపవాదు ఉండేది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రపంచకప్ హాట్ఫేవరెట్ను ఓడించి అభిమానుల ఆశలను చేజార్చింది. సమష్టిగా రాణించి రెండో సారి తుదిపోరుకు అర్హత సాధించింది కివీస్. 2015 ఫైనల్లో చేసిన తప్పును పునరావృతం కాకుండా ఈ సారి వరల్డ్‌కప్‌ను అందుకోవాలని భావిస్తోంది న్యూజిలాండ్ జట్టు.
బౌలింగ్ విభాగంలో పటిష్ఠంగా ఉన్న కివీస్ బ్యాటింగ్‌లో వెనుకంజలో ఉంది. మెగాటోర్నీలో ఆ జట్టు చేసిన స్కోరులో మూడో వంతు పరుగులు కేన్ విలియమ్సన్ ఒక్కడే చేశాడు. రాస్ టేలర్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. టాపార్డర్ విఫలమౌతూ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ అభిమానుల్లో గుబులురేపుతుంది. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, బౌల్ట్ విజృంభిస్తున్నారు. ఫెర్గ్యూసన్, సాంట్నర్ రాణిస్తున్నారు. బ్యాటింగ్‌పై దృష్టిపెడితే ఇంగ్లాండ్‌ను దెబ్బతీసి ప్రపంచకప్ కైవసం చేసుకోవడం కివీస్‌కు పెద్ద సమస్యేం కాదు.
క్రికెట్‌ను కనిపెట్టింది.. కప్పు కొల్లగొడుతుందా..!
క్రికెట్‌ను కనిపెట్టిన దేశం.. విశ్వవిజేత కాలేకపోయింది. ఇప్పటికీ మూడు సార్లు ఫైనల్ చేరిన జట్టు ఒక్కసారి కూడా కప్పు కైవసం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం నాలుగోసారి తుదిపోరుకు చేరిన ఇంగ్లీష్ జట్టు తన కలను నేరవేర్చుకోవాలని భావిస్తోంది. సెమీస్‌లో ఆసీస్‌ను 225 పరుగులకే పరిమితం చేసి ఫైనల్ చేరింది.
'ఫ్లాట్ పిచ్‌లపైనే ఇంగ్లాండ్ రాణిస్తుంది' అనే అపవాదుకు పుల్‌స్టాప్ పెడుతూ.. బౌలింగ్‌కు అనుకూలించిన మైదానంలో ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ ఆరంభం నుంచి అదరగొట్టింది. మధ్యలో వరుసగా ఓడి సెమీస్‌కు చేరుతుందా అనుకున్నారు. అయితే మళ్లీ విజృంభించి వరుస విజయాలను సొంతం చేసుకుంది. లీగుల్లో వైఫల్యాలను పునరావృతం చేయకుండా సమష్టిగా రాణిస్తే ఇంగ్లీష్ జట్టుకు కప్పు కల నేరవేరే అవకాశముంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది ఇంగ్లాండ్.