ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన బంగ్లాదేశ్‌కు సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడి ఇప్పటికే సెమీస్ ఆశలపై నీళ్లు చల్లుకుంది అఫ్గానిస్థాన్. ఈ రెండింటి మధ్య నేడు సౌతాంప్టన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
సెమీస్ చేరాలంటే బంగ్లా గెలవాల్సిందే..
ఇంగ్లాండ్‌పై గెలిచిన శ్రీలంక సెమీస్‌పై బంగ్లాకు ఆశలు రేకెత్తించింది. పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తలో రెండింటిలో విజయం సాధించాయి. మిగిలిన మ్యాచులన్నింటిలో బంగ్లా గెలిచి.. పాక్, శ్రీలంక ఓడితే టైగర్స్‌కు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అందుకు ఈ రోజు అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది.
విండీస్‌పై 322 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లోనే సునాయాసంగానే ఛేదించింది బంగ్లాదేశ్. అదే విధంగా ఆసీస్ నిర్దేశించిన 382 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లా.. 333 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ప్రపంచకప్‌లో 425 పరుగులు చేసి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు.
బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన చేస్తోంది బంగ్లాదేశ్. రుబెల్ హుస్సేన్, సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రెహమాన్ నిలకడగా రాణిస్తున్నారు.
ఒక్క గెలుపు కోసం అఫ్గాన్ ఎదురుచూపులు..
అఫ్గానిస్థాన్ విషయానికొస్తే ప్రపంచకప్‌లో గెలుపు కోసం ఆరాటపడుతోంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాటపటిమతో అందరిని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌పై పరాభావం నుంచి త్వరగానే కోలుకున్న అఫ్గాన్.. ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఉత్కంఠగా జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి వరకు ఆడి తృటిలో గెలుపుకు దూరమైంది. 224 పరుగుల లక్ష్య ఛేదనలో 11 పరుగులతో ఓటమి పాలైంది.