బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ 12వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజృంభించింది. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసింది. జేసన్ రాయ్(153) శతకంతో అదరగొట్టగా.. బెయిర్ స్టో(51), బట్లర్(64) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహదీ హసన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మోర్తాజా, ముస్తాఫిజర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రాయ్ - బెయిర్ స్టో 128 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ జోడీని విడగొట్టడానికి బంగ్లా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఎడపెడా బౌండరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. 20వ ఓవర్లో మోర్తాజా.. బెయిర్ స్టోను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు.
రయ్ రయ్మనిపించిన రాయ్
బెయిర్ స్టో ఔటైన తర్వాత జేసన్ రాయ్ మరింత విజృంభించాడు. 92 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 14 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తరపున ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. జేసన్ రాయ్ కంటే ముందు 2011 వరల్డ్‌కప్‌లో స్ట్రాస్ 158 పరుగులు చేశాడు.
చివర్లో బట్లర్, మోర్గాన్(35) ధాటిగా ఆడారు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. బట్లర్ 33 బంతుల్లో అర్ధశతకం చేశాడు. బట్లర్ ఔటైన తర్వాత స్కోరు వేగం కాస్త మందగించినా.. చివర్లో ప్లంకెట్(27), క్రిస్ ఓక్స్(18) దాటిగా ఆడారు.
చివరి పది ఓవర్లలో 111 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు. 2011, 2015 మెగాటోర్నీల్లో బంగ్లాపై ఓడిన ఇంగ్లాండ్.. గెలవాలనే కసిని ఈ మ్యాచ్‌లో చూపించింది.
ఇన్నింగ్స్ రికార్డులు
- ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు.
- ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 386 పరుగులే అత్యధిక ఇన్నింగ్ స్కోరు
- కార్డిఫ్ మైదానంలోనూ ఇదే అత్యధిక స్కోరు.
- 300, అంతకంటే ఎక్కువ స్కోరు వరుసగా ఏడు సార్లు చేసిన జట్టుగా రికార్డు సాధించింది ఇంగ్లాండ్.