భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగే కాదు... ఐసీసీకి అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే మ్యాచ్ కూడా. టోర్నీ ఏదైనా, వేదిక ఎక్కడైనా ఈ హోరాహోరీ పోరుకు అభిమానుల తాకిడి ఎప్పుడూ తగ్గదు. ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అత్యంత భావోద్వేగాలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే ఇదే అంశం ఇప్పుడు టికెట్ అమ్మకందారులను అత్యాశలో ముంచెత్తుతోంది. సాధారణ టికెట్ ధరలకంటే ఊహించని విధంగా రేట్లను పెంచేసి అభిమానుల నుంచి భారీగా దండుకుంటున్నాయి టికెట్లను విక్రయించే కొన్ని సంస్థలు. తాజాగా మాంచెస్టర్‌లో జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో ఇలాంటి దృశ్యమే ఎదురైంది. ఒక్కో టికెట్‌ను ఏకంగా రూ.4 లక్షలకు పైగానే విక్రయించింది వయాగోగో సంస్థ.
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడైపోయాయని ఐసీసీ కొద్ది నెలల క్రితమే ప్రకటించింది. వీటిలో రెండొంతుల మూడుభాగాల టికెట్లు భారత అభిమానులే కొనుగోలు చేశారని.. పాక్ అభిమానులు కేవలం 18 శాతం టికెట్లు మాత్రం కొన్నారని తెలిపింది.