ప్రపంచకప్ విజేత, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త. యువీ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సిక్సర్లతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. గతేడాది జూన్‌లో అతడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. 'పంజాబ్ క్రికెట్ అసోసియేషన్' కార్యదర్మి పునీత్ సంప్రదించడంతో తన సొంత రాష్ట్రం కోసం తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దేశవాళీ టీ20 టోర్నీకి పంజాబ్ జట్టులోని 30 మంది ప్రాబబుల్ ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ పేరు నమోదైంది.
ఇటీవలే 40వ వసంతంలో అడుగుపెట్టిన అతడు పరోక్షంగా ఈ విషయాన్ని తన అభిమానులకు వెల్లడించాడు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నాడు. వీడియోలో యువీ మైదానంలో బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు.
2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ సాధించడంలో యువీ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 2019, జూన్‌లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అతడు కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడాడు.
శ్రీశాంత్ కూడా..
యువరాజ్‌తో పాటు పేసర్ శ్రీశాంత్ కూడా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అతడిపై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌తో అతడిపై ఉన్న నిషేధం తొలగిపోయింది. అనంతరం క్రికెట్ ఆడాలని సాధన మొదలుపెట్టిన శ్రీశాంత్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టు ఆటగాళ్ల ప్రాబబుల్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆ జట్టులో సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప కూడా ఉన్నారు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో ఉన్న శ్రీశాంత్ భారత్ తరఫున చివరగా 2011, ఆగస్టులో ఆడాడు.
ఐపీఎల్‌లో పునరాగమనం చేయాలని భావిస్తోన్న శ్రీశాంత్ తన కలను నెరవేర్చుకోవాలంటే ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తాచాటాల్సి ఉంది. ఫిబ్రవరి ఆరంభంలో ఐపీఎల్ వేలం నిర్వహిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి చూపు ఈ దేశవాళీ టోర్నీపై నెలకొంది. దీనిలో సత్తాచాటిన వారికి వేలంలో భారీ డిమాండ్ ఉంటుంది. కాగా, జనవరి 10 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఈ టోర్నీ ఆరు రాష్ట్రాల్లో జరుగనుంది. బయోసెక్యూర్ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
రైనా....
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా దేశవాళీ క్రికెట్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ జట్టు తరపున ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడనున్నట్లు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:కరోనా నిబంధనలు బేఖాతరు.. లిన్, లారెన్స్లకు ఫైన్