మా ఊరిపేరు చిన్నప్పన్‌పట్టి.. ఓ చిన్న టీకొట్టు కూడా లేని కుగ్రామం అది. సేలం నగరానికి పశ్చిమాన 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఊళ్లోకి వెళ్లే ప్రధానదారికి కాస్త పక్కన, మిగతా ఇళ్ల నుంచి ఎడంగా, ఓ చిన్న ఇంట్లో ఇప్పటికీ 'చికెన్ పకోడీలు' అమ్ముతూ ఉంటుంది మా అమ్మ శాంత. ఆ చిన్న ఇంట్లోనే ఒకప్పుడు మేం ఏడుగురం ఉండేవాళ్లం. తక్కువ అద్దెకే వస్తుందని మిగతా ఇళ్లకు దూరంగా తుప్పల మధ్య ఉన్న ఆ ఇంటిని తీసుకున్నాడు నాన్న. వర్షాలొస్తే నీటి పాములూ, జెర్రులూ, తేళ్లూ ఇంట్లోకి వస్తుండేవి. ఇంట్లో మేం ఐదుగురం సంతానం.. నేనే పెద్దవాణ్ణి. నా తర్వాత ముగ్గురు చెల్లెళ్లూ, ఓ తమ్ముడు. మాది బతికి చితికిన చేనేత కుటుంబం. చేనేతకు ఆదరణ తగ్గడం వల్ల నాన్న ఓ పవర్‌లూమ్ కంపెనీలో కూలీగా ఉండేవారు. బొటాబొటి ఆదాయం కారణంగా రేషన్ షాపులో ఇచ్చే పప్పులూ, బియ్యాలతోనే కడుపు నింపుకునేవాళ్లం. అది కూడా నెలాఖరునైతే గంజినీళ్లతోనే సర్దుకోవాల్సి వచ్చేది. పిల్లలమంతా బాలకార్మికులుగా మారే పరిస్థితులే మావి.. కానీ అమ్మా నాన్నలు అలా కానివ్వలేదు. 'మనం పస్తులున్నా సరే పిల్లల్ని కనీసం ఇంటర్ వరకైనా చదివించాలి' అనుకున్నారు. సర్కారు బడిలో చేర్పించారు. అక్కడి మధ్యాహ్న భోజన పథకమే కొంతలో కొంత మా ఆకలి తీర్చింది. బడిలో నా చెల్లెళ్లూ, తమ్ముడూ బాగా చదివేవాళ్లు కానీ నేనే మొద్దబ్బాయిగా పేరుపడ్డాను. టీచర్లు నన్నెప్పుడూ తిడుతుండటం, పిల్లలందరూ నవ్వుతుండటం వల్ల క్లాసులో కూర్చోవడం ఇబ్బందిగా ఉండేది. అదే నా ధ్యాసని ఆటలవైపు మళ్లించింది. ఐదో తరగతికొచ్చాక ఆ ఆసక్తికి ఓ ఆలంబన దొరికింది.
టీం చిన్నప్పన్‌పట్టి!
మా ఊళ్లో 'చిన్నప్పన్‌పట్టి క్రికెట్ క్లబ్' అనే టీమ్ ఉండేది. దానికి మా పొరుగింటి అన్నయ్య జయప్రకాశ్(జేపీ) కెప్టెన్. మా జిల్లాలో ఎక్కడ క్రికెట్ పోటీలు జరిగినా ఆ జట్టే విజయం సాధిస్తుండేది. దాంతో మేమంతా జేపీని హీరోలాగ చూసేవాళ్లం. సహజంగానే ఆయన్ని చూసి మా ఈడువాళ్లందరం క్రికెట్ ఆడుతుండేవాళ్లం. మా పక్క ఊరి థియేటర్‌లో ఓసారి రజనీకాంత్ సినిమా వస్తే చూడటానికి వెళ్లాను. అక్కడి తొక్కిసలాటలో నా చేయి విరిగింది. అలా కట్టుకట్టిన చేత్తోనే ఓ సారి క్రికెట్ ఆడుతుంటే అటుగా వచ్చిన జేపీ నన్ను చూసి మెచ్చుకున్నాడు. అంతేకాదు, అప్పట్నుంచి తన మ్యాచ్‌లకు నన్నూ తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. పెద్దవాళ్లందరూ ఆడుతుంటే నేను 'బాల్ బాయ్'గా ఉండేవాణ్ణి.
ఓసారి నా దగ్గరకొచ్చిన బాల్‌ని పట్టి మళ్లీ విసిరేసే తీరులో.. ఏదో 'ప్రత్యేకత' ఉందని గమనించినట్టున్నాడు జేపీ. ఆ రోజు నన్ను పిలిచి బౌలింగ్ వేయమన్నాడు. నా బౌలింగ్‌కు ఎదురుగా ఉన్న సీనియర్ బ్యాట్స్‌మన్ కూడా తత్తరపాటుకు గురయ్యాడు ఆ రోజు. ఆ తర్వాతి రోజే జేపీ 'ఇకపైన నువ్వూ మా టీమ్‌లో మెంబర్' అనేశాడు. నా ఈడువాళ్లెవరికీ దక్కని అవకాశమిది! టీమ్‌లో జేపీ సూచనలతో 'లెఫ్ట్‌ఆర్మ్ పేసర్'గా మారాను. బంతి విసిరే వేగాన్ని పెంచాను. రెండేళ్లలోనే మా సేలం జిల్లాలో ఉత్తమ బౌలర్‌గా నిలిచాను! క్రికెట్ నాకు ఇచ్చిన ఈ ఆత్మవిశ్వాసం.. చదువులోనూ ఉపయోగపడింది. మరీ బ్రిలియంట్‌గా కాకున్నా నన్ను యావరేజ్‌గా నిలిపింది. ఎలాగోలా ఇంటర్మీడియట్ నెట్టుకొచ్చాను. ఆ తర్వాత కూలీపనులకు వెళ్లాలనుకున్నా.
నన్ను దత్తత తీసుకున్నాడు..
నేను పదో తరగతి పాసయ్యేనాటికి నాన్న పనిచేస్తున్న బట్టల మిల్లు మూసేశారు. దాంతో ఆయన రైతు కూలీగా మారాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో బాగా బలహీనపడ్డాడు. అప్పుడు కుటుంబ బాధ్యతల్ని అమ్మ తీసుకుంది. పొలం పనులతోపాటూ నాలుగిళ్లకు వెళ్లి అంట్లు తోమేది. అంతేకాదు, మార్కెట్టుకెళ్లి చికెన్ తెచ్చి పకోడీలు చేసి అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైనా నేను బ్యాటూ, బాలూ తీసుకుంటే అమ్మానాన్నా ఏమీ అనేవారు కాదు కానీ.. ఊళ్లో వాళ్లందరూ చెడామడా తిట్టేవాళ్లు. 'ఇంటికి పెద్దవాడివి. నీ తర్వాత నలుగురున్నారు.. ఇంకా ఈ ఆటలేంటి నీకు! కాస్తయినా సిగ్గుండాలి..!' అనేవాళ్లు.
ఆ మాటలు పడలేకే ఇంటర్మీడియట్ పూర్తికాగానే నేనూ కూలికెళ్లాలని తీర్మానించుకున్నా. ఆ విషయం జేపీతో చెబితే ఆయన మండిపడ్డాడు. మా అమ్మానాన్నల దగ్గరకొచ్చి 'ఇవాళ్టి నుంచి మీవాడి బాధ్యత నాది. వాడి చదువూ సంధ్యా మొత్తం నేనే చూసుకుంటా. క్రికెట్లో వాడెంతో సాధించగలడు.. నన్ను నమ్మండి!' అన్నాడు. ఆ మాటలకు అమ్మానాన్నలు కదిలిపోయారు. అతని చేతులు పట్టుకుని ఏడుస్తూ 'నీ ఇష్టమయ్యా. వాణ్ణి ఇక నీ బిడ్డే అనుకో!' అనేశారు. ఇదో రకం దత్తతే అనిపిస్తోంది ఇప్పుడు ఆలోచిస్తే! అలా నా బాధ్యతలు తీసుకున్న జేపీ అన్నయ్య నన్నో డిగ్రీ కాలేజీలో బీబీఏ కోర్సులో చేర్పించాడు. కాలేజీకి వెళ్లినా వెళ్లకున్నా క్రికెట్‌పైనే ధ్యాస పెట్టమన్నాడు. ప్రతిరోజూ కొన్ని టిప్స్ నేర్పిస్తూ ప్రాక్టీస్ చేయమనేవాడు. అలాగే చేశాను. దాంతోపాటూ నా ఫిట్‌నెస్‌పైనా దృష్టిపెట్టా.
బూట్లు కూడా లేవు..
కాలేజీలో క్లాసులకు వెళ్లకున్నా గ్రౌండ్‌కి మాత్రం కచ్చితంగా వెళ్లేవాణ్ణి. మ్యాచ్‌లున్నా లేకున్నా గ్రౌండు చుట్టూ పరుగెత్తేవాణ్ణి. అప్పట్లో బూట్లు కూడా లేవు.. ఒట్టికాళ్లతోనే ఉండేది నా సాధన. ఆ తర్వాత అన్నయ్య ఎంతో శ్రమపడి నా షూ కోసం ఓ కంపెనీ స్పాన్సర్‌షిప్ ఇప్పించాడు. ఆ తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్లి తమిళనాడు క్రికెట్ క్లబ్ అసోసియేషన్స్‌లో ఆడించడం మొదలుపెట్టాడు. అక్కడే, నా ఇరవైయేళ్ల వయస్సులో, తొలిసారి క్రికెట్ బాల్‌ని చేతుల్లోకి తీసుకున్నా!
కానీ, నాకు టెన్నిస్ బాల్‌కీ దానికీ పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. నేను నా శైలిని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. అదే నన్ను వేరుగా నిలిపింది. తమిళనాడులోని ఉత్తమ ప్లేయర్స్‌లో ఒకడిగా మార్చింది. దాంతో.. అండర్-13, అండర్-16 ఇలాంటి వాటిల్లోకి వెళ్లకుండానే నేరుగా రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యా. నా తొలి మ్యాచ్.. ముంబయి టీమ్‌తో. అప్పటికి పదేళ్లుగా నేను కన్న కలలన్నీ నెరవేరిన రోజు అది! అంతేకాదు, ఆ కలలన్నీ నా కళ్ల ముందే కూలిన రోజు కూడా!