తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: 2015 రికార్డులు.. మెరుపులు.. భావోద్వేగాలు - Australia

2015 క్రికెట్​ ప్రపంచకప్ గుర్తుందా? ఆ టోర్నీలో​ పాకిస్థాన్​పై భారత్​ గెలవడాన్ని చూసి మీరూ చిందులేశారా? న్యూజిలాండ్​ సారథి మెక్​కలమ్​ కళ్లు చెదిరే ఫీల్డింగ్​కు మంత్రముగ్ధులయ్యారా? షేన్​ వాట్సన్​కు నిప్పులుచెరిగే బంతులు​ వేసిన పాక్​ ఆటగాడు వహబ్​ రియాజ్​ బౌలింగ్​ మిమ్మల్ని అలరించిందా? ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలున్న 2015 ప్రపంచకప్​ను మరోసారి చూద్దాం.

WC 19: 2015-రికార్డులు.. మెరుపులు..భావోద్వేగాలు

By

Published : May 28, 2019, 6:01 AM IST

Updated : May 28, 2019, 9:27 AM IST

ఎన్నో ఆశలు, ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో జ్ఞాపకాల కలయికే ఆస్ట్రేలియా,న్యూజిలాండ్​ వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్​ టోర్నీ. బ్యాట్స్​మెన్​ బాదుడు, బౌలర్ల విజృంభణ, ఫీల్డర్ల కళ్లు చెదిరే విన్యాసాలు, డబుల్​ సెంచరీలు, ఉత్కంఠ భరిత ముగింపులు, పేలవ ప్రదర్శనలు, జట్ల సమష్టి కృషి.. ఆ టోర్నీ ఆసాంతం క్రికెట్​ ప్రేమికులను అలరించాయి. వీటన్నింటినీ దాటి చివరకు ప్రపంచకప్​ను ముద్దాడింది ఆస్ట్రేలియా.

ఆసీస్​

14 జట్లు.. రెండు గ్రూపులు

2015 ప్రపంచకప్​నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చాయి. 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించింది ఐసీసీ. డిఫెండింగ్​ ఛాంపియన్​గా బరిలో దిగిన టీమిండియా... గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్​, వెస్టిండీస్​, ఐర్లాండ్​, జింబాబ్వే, యూఏఈ జట్లతో తలపడింది. 2011 ప్రపంచకప్​లో క్వార్టర్​ ఫైనల్స్​లోనే వెనుదిరిగిన ఆస్ట్రేలియా... గ్రూప్​ ఏలో న్యూజిలాండ్​, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్​, అఫ్గానిస్థాన్, స్కాట్​లాండ్​​లతో పోటీపడింది.

ప్రపంచకప్​ ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్​లో పేలవ ప్రదర్శన చేసిన భారత్​... టోర్నీ ముందు అభిమానులను భయపెట్టింది. కానీ మెగాటోర్నీలో మాత్రం డిఫెండింగ్​​ ఛాంపియన్​ స్థాయికి తగిన ప్రదర్శనే చేసింది.

పాక్​పై మరో విజయం

ఆసియా సహా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్​ అభిమానులు ఎదురుచూసేది​ భారత్​- పాకిస్థాన్ మ్యాచ్​ కోసమే​. అప్పటి దాకా ఐసీసీ టోర్నమెంట్లలో ఎన్నడూ దాయాది చేతిలో ఓడిపోని టీమిండియా... గ్రూప్​ దశలో పాక్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించి ఆ పరంపరను కొనసాగించింది. మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్​తో ఆరు సార్లు తలపడిన భారత్​... ఒక్కసారీ ఓడిపోలేదు.

సెమీస్​లో ముగిసిన భారత్​ పోరు

2011​లో తన సారథ్యంలో భారత్​కు ప్రపంచకప్​ అందించిన ధోని.. 2015లోనూ జట్టును ముందుండి నడిపించాడు. బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ, ధావన్​, కోహ్లీ, రహానే.. బౌలర్లు ఉమేష్​ యాదవ్​, షమీ, అశ్విన్​లు రాణించడం వల్ల సెమీస్​లో అడుగుపెట్టింది భారత్​. కానీ టోర్నీలో టీమిండియాకు అదే చివరి మ్యాచ్​గా మిగిలిపోయింది. 2011లో క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్​... ఈసారి సెమీస్​లో విఫలమైంది. ఆసీస్​ చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్​లో ధావన్​ మినహా ఎవరూ రాణించలేదు. కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. మూడో ప్రపంచకప్​ వేటను సెమీస్​తోనే ముగించింది టీమిండియా.

ఉత్కంఠ పోరిదే..

ఎన్నో ఆశలతో మెగాటోర్నీలో అడుగుపెట్టిన న్యూజిలాండ్​ అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీ మొత్తం కళ్లుచెదిరే ఫీల్డింగ్, బ్యాటింగ్​ చేసిన సారథి బ్రెండన్​ మెక్​కలమ్​​ కివీస్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా గ్రూప్​ దశలో జరిగిన న్యూజిలాండ్​- ఆస్ట్రేలియా పోరు 2015 ప్రపంచకప్​లోనే అత్యంత ఉత్కంఠ భరితంగా మ్యాచ్​. తక్కువ స్కోరు మ్యాచ్​లూ నరాలు తెగే ఉత్కంఠ కలిగిస్తాయని ఈ పోరు నిరూపించింది. అద్భుతమైన బౌలింగ్​తో ఆస్ట్రేలియాను 151 పరుగలకే కట్టడిచేసింది కివీస్​ జట్టు. బౌల్ట్​ 5 వికెట్లు తీసి తన స్వింగ్ బౌలింగ్​​తో బ్యాట్స్​మెన్​ను హడలెత్తించాడు. అనంతరం మెక్​కలమ్​ విజృంభించి ఆడటం వల్ల గెలుపు కివీస్​దే అనుకున్నారు. కానీ అతడు ఔటయ్యాక మిచెల్​ స్టార్క్​(6/28) ధాటికి న్యూజిలాండ్​ మిడిలార్డర్​ కుప్పకూలింది. చివరకు విలియమ్సన్​​ జట్టును గట్టెక్కించాడు. మ్యాచ్​ మొత్తం 55 ఓవర్లలోనే ముగిసింది. గ్రూప్​దశలో జరిగిన ఈ పోరు 2015 ప్రపంచకప్​ 'మ్యాచ్​ ఆఫ్​ ది టోర్నమెంట్'​గా నిలిచింది.

ఆ జట్లకు అందని ద్రాక్షే

​దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​కు ప్రపంచకప్​ ఇప్పటివరకు ఓ అందని ద్రాక్ష. అంచనాలకు మించి రాణించినా కప్​ వేటలో ప్రతిసారీ విఫలమయ్యేవి ఈ జట్లు. అలాంటి జట్లు 2015 ప్రపంచకప్​ సెమీస్​లో పోటీ పడ్డాయి. తొలి ఇన్నింగ్స్​లో దక్షిణాఫ్రికా​ అద్భుతంగా బ్యాటింగ్​ చేసింది. 43 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి జోరుమీదున్న సమయంలో వరుణుడు మ్యాచ్​ను అడ్డుకున్నాడు. డక్​వర్త్​ లూయీస్​​ ప్రకారం 291 పరుగుల లక్ష్యంతో బరిలో దిగింది న్యూజిలాండ్​. మెక్​కలమ్​​, గ్రాంట్​ ఎలియట్​​​, కొరీ అండర్సన్​ రాణించడం వల్ల ఫైనల్స్​లో అడుగుపెట్టింది కివీస్​. సెమీస్​లో ఓడిన అనంతరం ప్రోటీస్​ ఆటగాళ్లు కంటతడి పెట్టిన ఘటన క్రికెట్​ అభిమానులను కలచివేసింది.

ఆసీస్​కు ఎంతో ప్రత్యేకం

ఆస్ట్రేలియా అప్పటికే 1987, 1999, 2003, 2007 ప్రపంచకప్​లు గెలిచింది. కానీ 2015 ప్రపంచకప్​ ఆ జట్టుకు ఎంతో ప్రత్యేకం. ​ బ్యాట్స్​మెన్​ ఫిలిప్​ హ్యూస్​​ ఆకస్మిక మృతితో ఆసీస్​​ ఆటగాళ్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ చేదు అనుభవంతో ప్రపంచకప్​లో అడుగుపెట్టిన ఆసీస్​ ఎంతో కసిగా ఆడింది. గ్రూప్​ దశలో వర్షం వల్ల రద్దయిన బంగ్లాదేశ్​ మ్యాచ్​, న్యూజిలాండ్​తో ఓటమి మినహా అన్ని మ్యాచ్​లు గెలిచింది.

ఫలించని 183 మ్యాజిక్​

సారథి మెక్​కలమ్​​ మీద కివీస్​ జట్టు ఎంత ఆధారపడిందో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్​ మ్యాచ్​ చూస్తే అర్థమవుతుంది. ఈసారి కచ్చితంగా ప్రపంచ కప్​ను​ సొంతం చేసుకోవాలన్న ధ్యేయంతో మెల్​బోర్న్​లో జరిగిన ఫైనల్స్​లో అడుగుపెట్టిన న్యూజిలాండ్​కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. మెక్​కలమ్​​ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత జట్టు మెత్తం 183 పరుగులకే కుప్పకూలింది. 1983 ప్రపంచకప్​ను సొంతం చేసుకున్న భారత్​... ఫైనల్​లో సరిగా 183 పరుగులే చేసింది. అదే మ్యాజిక్​ పునరావృతం అవుతుందనుకున్నారు అంతా. కానీ మైఖేల్​ క్లార్క్​(74) కెప్టెన్​ ఇన్నింగ్స్​తో ఆసీస్​కు ఐదో ప్రపంచకప్​ను అందించాడు. ఆసీస్​ ఆటగాళ్లు కప్​ను ఫిలిప్​ హ్యూస్​​కు అంకితమిచ్చి ఘన నివాళులర్పించారు. న్యూజిలాండ్​ కల చెదిరింది.

మెక్​కల్లమ్​

రికార్డులు.. విశేషాలు

⦁ ప్రపంచకప్​ చరిత్రలోనే తొలిసారిగా 2015లో రెండు ఆరంభ వేడుకలు జరిగాయి.

⦁ 2015కు ముందు జరిగిన ప్రపంచ కప్​ టోర్నీలో ఒక్క ద్విశతకం​ కూడా నమోదు కాలేదు. ఆ టోర్నీలో ఏకంగా రెండు డబుల్​ సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వేపై క్రిస్​ గేల్​ 215 పరుగులు చేశాడు.

మార్లెన్​ శామ్యూల్స్​తో 372 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేదు. వెస్టిండీస్​తో జరిగిన క్వార్టర్స్​లో న్యూజిలాండ్​ ఓపెనర్​ మార్టిన్​ గప్తిల్​​ 237 పరుగులు చేశాడు. రోహిత్​ శర్మ 264 పరుగుల తర్వాత వన్డేల్లో ఇప్పటికీ ఇదే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు.

మార్టిన్​​ గప్తిల్​

⦁ ఈ ప్రపంచకప్​లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర వరుసగా 4 శతకాలు చేసి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, స్కాట్​లాండ్​పై సెంచరీలు బాదాడు.

⦁ పాకిస్థాన్​తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ... వహబ్​ రియాజ్​ వేసిన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్​​ ఆసీస్​ బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పలు పెట్టింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్​లో షేన్​ వాట్సన్​కు వేసిన 33వ ఓవర్​ టోర్నమెంట్​కే హైలెట్​​.

⦁ ఈ ప్రపంచకప్​లో గప్తిల్​​ 547 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. బౌలింగ్​లో ఆ ఘనత మిచెల్​ స్టార్క్​(22 వికెట్లు) అందుకున్నాడు.

2015 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​, అఫ్గానిస్థాన్​, స్కాట్​లాండ్​, ఐర్లాండ్​, జింబాబ్వే, యూఏఈ జట్లు గ్రూప్​ దశలోనే ఇంటిముఖం పట్టాయి. క్వార్టర్స్​లో భారత్​తో తలపడిన బంగ్లాదేశ్​... న్యూజిలాండ్​తో తలపడిన వెస్టిండీస్​​... దక్షిణాఫ్రికాతో పోటీపడిన శ్రీలంక.. ఆస్ట్రేలియాను ఢీకొన్న పాక్​ ఓటమి పాలై వెనుదిరిగాయి.

2015 గతం. 2019 ప్రస్తుతం. మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్​ వేదిక జరగనున్న ఈ మెగాటోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి రికార్డులు సృష్టించే వీరులేవరో... కప్​ కొట్టే జట్టేదో వేచిచూడాలి.

ఇదీ చూడండి : క్రికెట్​ 'దేవుడి' కల నెరవేరిన వేళ

Last Updated : May 28, 2019, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details