క్రికెట్ సంగ్రామంలో పలు మెగాటోర్నీల్లో భారత జట్లు పోరాడి ఓడుతున్నాయి. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించినా కీలక సమరాల్లో నిరాశపరుస్తున్నాయి. ప్రపంచకప్ ఓటమి తర్వాత జోరు చూపించిన కోహ్లీసేన.. కివీస్‌పై టీ20 సిరీస్ గెలిచి ఆహా అనిపించింది. ఆ తర్వాత అదే జట్టుపై వన్డేల్లో క్లీన్‌స్వీప్ అయింది. భారీ స్కోరు సాధించినా వన్డేల్లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా 5-0 తేడాతో పొట్టిఫార్మాట్ సిరీస్ గెలిచిన చోటే 3-0 తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తయింది. ఫలితంగా 31 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి వన్డే సిరీస్ వైట్‌వాష్ అయిన చెత్త రికార్డును మూటగట్టుకుంది.
>> ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో విజయాల జైత్రయాత్ర కొనసాగించింది ప్రియమ్‌గార్గ్ నేతృత్వంలోని యువ టీమిండియా. కానీ తనకు ఏమాత్రం సాటిరాని ప్రత్యర్థి బంగ్లాదేశ్ చేతిలో ఫైనల్లో పరాజయం చెందింది. ఫలితంగా భారత్‌కు ఐదో ప్రపంచకప్ దూరమైంది.
>>తాజాగా ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరిగింది. ఇవే జట్లు ఫేవరెట్లుగా టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాయి. అంతేకాదు ఈ మెగాటోర్నీ 10 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో జరిగిన ట్రై సిరీస్‌లో భారత్ ఫైనల్లో ఓడిపోయింది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళా టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 11 పరుగుల తేడాతో కంగుతింది. ఫలితంగా తుది మెట్టుపై బోల్తాపడి టైటిల్‌ను పోగొట్టుకుంది.
ఇదే సమస్య.. తీర్చేదెలా?
భారత సీనియర్, జూనియర్, మహిళల జట్లు ఇలా ఓటమిపాలవడానికి కారణం మిడిలార్డర్. ఓపెనర్లు రాణిస్తున్నా... ప్రత్యర్థులను తక్కువ లక్ష్యాలకు బౌలర్లు అడ్డుకుంటున్నా ఫలితాలు మారట్లేదు. కారణం బ్యాటింగ్‌లో మిడిలార్డర్, చివరి ఓవర్లలో బౌలింగ్ సమస్యగా మారింది.