తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆటగాడు రోహిత్' - జాఫర్ వార్తలు

టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ప్రస్తుతం రోహిత్ ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడని.. విదేశాల్లోనూ అతడు సత్తా చాటగలడని అభిప్రాయపడ్డాడు.

రోహిత్
రోహిత్

By

Published : Jul 9, 2020, 1:10 PM IST

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ విదేశాల్లోనూ టెస్టుల్లో ద్విశతకాలు బాదగలడని మాజీ ఓపెనర్‌, రంజీ క్రికెట్‌ దిగ్గజం వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆకాశ్‌చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన వసీం.. టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ చేయడంపై స్పందించాడు.

"రోహిత్‌ ఇప్పుడు తన ఆటను మరింత బాగా అర్థం చేసుకుంటున్నాడని అనుకుంటున్నా. గతంలో మనం చూసిన ఆటగాడు కాదు ఇప్పుడు. ఎక్కడ తగ్గాలో అతనికి బాగా తెలుసు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్​ను గమనిస్తే కొన్ని మ్యాచ్‌ల్లో ఎంత ఓపిగ్గా ఆడాడో తెలుస్తుంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో ఆడేటప్పుడు తొలి పది ఓవర్ల పాటు బంతులు పరీక్ష పెట్టినా ఎంతో ఓపిగ్గా నిలబడి వికెట్‌ కాపాడుకున్నాడు."

- వసీం జాఫర్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

అలాగే‌ విదేశీ పిచ్‌లపైనా రోహిత్ తొలి 45 నిమిషాలు తడబడతాడని, ఆ సమయాన్ని జయిస్తే అక్కడ కూడా ద్విశతకాలు సాధిస్తాడన్నాడు జాఫర్. పరిస్థితులు చక్కబడ్డాయని అర్థం చేసుకున్నాక హిట్​మ్యాన్ చెలరేగిపోతాడని, అప్పుడు అతని స్ట్రైక్‌రేట్‌ 120-130కు పెరిగిపోతుందని వెల్లడించాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ ఎదురుదాడి చేయాలో అర్థం చేసుకునే దశలో ఉన్నాడని, అతడిలో ఆ రెండు పర్వాలు ఉన్నాయని వసీం చెప్పుకొచ్చాడు.

గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ ఐదు శతకాలతో చెలరేగిపోయాడు. అనంతరం స్వదేశంలో జరిగిన పలు టెస్టు సిరీస్‌ల్లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలోనే 2020లో న్యూజిలాండ్‌ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉన్నా గాయం కారణంగా ఆడలేకపోయాడు.

ABOUT THE AUTHOR

...view details