ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: ఆత్మవిశ్వాసంతో టీమ్ఇండియా.. కసితో ఆసీస్ - ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ 3

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు అంతా సిద్ధమైంది. సిడ్నీ వేదికగా జరగబోయే ఈ టెస్టుతో టీమ్ఇండియా పేసర్ నవదీప్ సైనీ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే 11 నెలల తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో జట్టు ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో టెస్టులో ఓడిన ఆసీస్​.. భారత్​కు ధీటైన సమాధానం ఇవ్వాలని ఎదురుచూస్తోంది.

Waiting for Hit-Man Show: Rohit and India ready to change Sydney script
సిడ్నీ టెస్టు: ఆత్మవిశ్వాసంతో టీమ్ఇండియా.. కసితో ఆసీస్
author img

By

Published : Jan 6, 2021, 6:30 PM IST

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో కీలకమైన మూడో టెస్టుకు టీమ్ఇండియా సిద్ధమైంది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ చేరికతో బలోపేతమైన భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న నవదీప్‌ సైనీ, 11 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. తొలి టెస్టు ఘోరపరాజయం అనంతరం రెండో టెస్టులో భారత జట్టును గొప్పగా నడిపించిన సారథి రహానె సిడ్నీలో టెస్టు మ్యాచ్‌ గెలిచి 42 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇటు వార్నర్‌, పుకోవ్‌ స్కీ చేరికతో బలోపేతమైన కంగారు జట్టు మూడో టెస్టులో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఈ మ్యాచ్ ఉదయం 5 గంటలకు ప్రారంభంకానుంది.

రోహిత్ వచ్చాడు

వరుసగా విఫలమవుతున్న మయాంక్ అగర్వాల్‌ స్థానంలో వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ తుది జట్టులోకి రాగా, గాయపడ్డ ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ సైనీకి చోటు దక్కింది. కరోనా నిబంధనల అతిక్రమణ వివాదం నడుమ ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. నెట్స్‌లో రోహిత్‌ బౌలర్లను సులువుగా ఎదుర్కోవడం భారత్‌కు సంతోషానిస్తోంది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సైనీ ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన చేయాలని టీమ్ఇండియా కోరుకుంటోంది.

in article image
టీమ్ఇండియా

సిడ్నీ చిక్కుతుందా?

సిడ్నీలో 42 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని ఈ మ్యాచ్‌తో సాధించాలని రహానె సేన భావిస్తోంది. సిడ్నీ పిచ్‌ భారత బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉండడం గత పర్యటనలో పుజారా, రిషబ్ పంత్‌లు ఇక్కడ భారీ శతకాలు సాధించడం భారత్‌ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. రోహిత్, శుభ్‌మన్‌గిల్‌ మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పగలిగితే పుజారాపై భారం తగ్గి అతడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని మాజీలు సూచిస్తున్నారు. హనుమ విహారీకి ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. రాహుల్‌ గాయంతో జట్టులో స్థానాన్ని కాపాడుకున్న విహారి ఈ మ్యాచ్‌లోనూ రాణించకపోతే తదుపరి సిరీస్‌లో వేటు పడక తప్పని స్థితి నెలకొంది.

బౌలర్లే కీలకం

ఆస్ట్రేలియాను రెండు టెస్టుల్లోనూ 200 పరుగుల లోపే కట్టడి చేసిన బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. పేస్‌ దళానికి జస్ప్రిత్‌ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా స్పిన్ దళాన్ని అశ్విన్‌ నడిపిస్తున్నాడు. బుమ్రాకు తోడుగా సిరాజ్, సైనీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లపై ఎలాంటి ప్రభావం చూపుతారో వేచిచూడాలి. సిరీస్‌లో ఇప్పటికే 10 వికెట్లు తీసిన అశ్విన్‌ను ఎదుర్కోవడం కంగారులకు అంతా తేలిక కాదు.

కసితో ఆసీస్

తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత కూడా టీమ్ఇండియా బలంగా పుంజుకోవడం ఆస్ట్రేలియాకు మింగుడు పడడం లేదు. వార్నర్‌, పుకోవ్‌ స్కీ చేరికతో కంగారుల బ్యాటింగ్‌ బలం పెరిగింది. వార్నర్‌ వంద శాతం ఫిట్‌నెస్‌తో లేకపోయినా ఆస్ట్రేలియా బరిలోకి దింపుతోంది. వార్నర్‌ అంచనాలకు తగ్గట్లు రాణిస్తే భారత్​కు కష్టమే. స్మిత్‌ ఫామ్ కంగారు జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ సత్తా చాటాలని ఆసిస్‌ భావిస్తోంది. మిచెల్ స్టార్క్, హెజిల్‌వుడ్, కమిన్స్‌లతో కూడిన కంగారుల పేస్‌ దళం భారత్‌ బ్యాటింగ్‌కు సవాల్‌ విసరనుంది. స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ కూడా రాణిస్తే భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసి ఒత్తిడి పెంచాలని పైన్ సేన భావిస్తోంది.

ఇవీ చూడండి: సిడ్నీ టెస్టుకు భారత జట్టు ప్రకటన.. సైనీ అరంగేట్రం

ABOUT THE AUTHOR

...view details