అతడు బరిలో దిగితే సెంచరే. ప్రత్యర్థి జట్టు ఏదైనా శతకం బాదాల్సిందే. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే అభిమానుల్లో ఉండే అంచనాలివి. వరుస శతకాలతో జోరు చూపించిన కోహ్లీ ప్రస్తుతం ఆ పరుగుల వరద పారించలేకపోతున్నాడు. సెంచరీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.
వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ. బ్యాట్ పడితే పరుగుల మోత మోగించే విరాట్ కొంత కాలంగా విఫలమవుతున్నాడు. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ చివరిసారి సెంచరీ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ కోసం అభిమానుల ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా ఈరోజు న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో విరాట్ మొదటి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.
మొత్తంగా ఈ న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఈ టూర్లో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. అంటే పరుగులు సాధించడానికి కింగ్‌కోహ్లీ ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. విరాట్ వరుసగా 19 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ 19 ఇన్నింగ్స్‌ల్లో ఆరు అర్ధ సెంచరీలు సాధించినా వాటిని సెంచరీగా మలచుకోవడంలో కోహ్లీ విఫలమయ్యాడు.
ఇలా 19 అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఖాతాలో సెంచరీ లేకపోవడం ఇది మూడోసారి. గతంలో 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు 24 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ సెంచరీ సాధించకపోగా.. 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో శతకం నమోదు చేయలేకపోయాడు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసే సమయానికి చూస్తే ప్రతి ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ శతకం సాధించిన ఘనత ఉండగా.. వరుసగా 19 ఇన్నింగ్స్‌ల్లో శతకం లేకపోవడం గమనార్హం.