రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రెండు మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే ఆ దేశం చేరుకుంది. అయితే, ఈ సిరీస్‌లో భారత్ 5 టీ20 మ్యాచులు ఆడనుండటం వల్ల కోహ్లీ ఆ రెండు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20ల్లో మరో ఎనిమిది సిక్సులు కొడితే 50 సిక్సులు బాదిన రెండో కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు విరాట్. ఇప్పటివరకూ కేవలం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మోర్గాన్ టీ20ల్లో 62 సిక్సులు కొట్టాడు. ఇక పరుగుల విషయంలోనూ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. భారత మాజీ సారథి ధోనీ టీ20ల్లో కెప్టెన్‌గా 1,110 పరుగులు చేశాడు. ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న కోహ్లీ 1,032 పరుగులతో ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు అతి సమీపంలో ఉన్నాడు. ప్రస్తుతం టీ20ల్లో 1,273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అందరికంటే ముందున్నాడు. అయితే, కోహ్లీ మరో 80 పరుగులు చేస్తే ధోనీ రికార్డు, 241 పరుగులు చేస్తే డుప్లెసిస్ రికార్డును అధిగమిస్తాడు.