టీమ్ఇండియా క్రికెటర్ అజింక్య రహానె.. టెస్టుల్లో తొలిసారిగా కెప్టెన్సీ అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. బాధ్యతలు అందుకున్న ఆ రోజు తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు. దానిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. అయితే కోహ్లీ చెప్పాకే సారథిగా బాధ్యతలు అందుకున్నట్లు వెల్లడించాడు.
"2017లో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో అప్పటికే మూడు టెస్టులు ఆడాం. మొదటిది ఆసీస్, రెండో మ్యాచ్లో మేం గెలిచాం. మూడోది డ్రా అయింది. నాలుగో టెస్టు ఆడాల్సిన సమయానికి కోహ్లీ అనుకోకుండా గాయపడ్డాడు. కానీ ఆ మ్యాచ్ గెలవడం మాకు ఎంతో ముఖ్యం. జట్టంతా టెన్షన్. అప్పుడు కోహ్లీ నాకు ఫోన్ చేసి సారథిగా బాధ్యతలు చేపట్టాలని అన్నాడు. తన పరిస్థితి బాగోలేదని, ఫిట్నెస్ ఇబ్బంది పెడుతుందని చెప్పాడు. కోచ్ అనిల్ కుంబ్లే కూడా నాతో ఇదే మాట అన్నాడు. కానీ నేను మాత్రం బాధ్యతలు స్వీకరించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోయాను. అందులో నుంచి తేరుకునేలోపే కెప్టెన్ పగ్గాలు అందుకున్నా. అందుకే ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం"
-రహానె, టీమ్ఇండియా క్రికెటర్