భారత సీనియర్ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్... యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు విలువైన సూచనలిచ్చాడు. విమర్శలను పట్టించుకోవద్దని సలహా ఇస్తూనే... ఆటపై ఎక్కువగా దృష్టిపెట్టాలని అన్నాడు. ఫామ్ ఉన్నప్పుడు పరిస్థితులు బాగానే ఉంటాయని... పరుగులు చేయలేనప్పుడే అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తుందని పేర్కొన్నాడు. అలాంటప్పుడు ధైర్యంగా నిలబడితే, టాప్ క్రికెటర్‌గా రాణించవచ్చని పార్థివ్ చెప్పాడు.
"ఈరోజుల్లో సీనియర్లతో కలిసి ఆడటం, డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం యువ క్రికెటర్లకు మంచి అవకాశం. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు వీళ్లకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. అందరి అభిప్రాయాల్ని పట్టించుకోవడం మానేసి ముఖ్యంగా ఆటపై దృష్టి పెట్టాలి. భారత్ తరఫున ఆడటం చాలా ఒత్తిడితో కూడిన విషయం. ప్రతి ఆటగాడు వివిధ సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటాడు. కష్ట సమయాల్లో రాణిస్తేనే మంచి క్రీడాకారుడిగా ఎదుగుతారు. పంత్.. నువ్వు ప్రతిభ ఉన్న క్రికెటర్‌వి. యాజమాన్యం, సెలక్టర్లు నీపై నమ్మకం ఉంచినప్పుడు నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు"